నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థులు వీరేనా?

ఎన్నికల గోదాలోకి ముందే దూకేందుకు కాంగ్రెస్ జాబితా రెడీ అయిందా.. ఆ పార్టీ అధిష్ఠానానికి రాష్ట్రం నుంచి జాబితా వెళ్లిందా.. అది ఉమ్మడిగా నిర్ణయించిందా, లేక రేవంత్ టీం రెడీ చేసిందా.. అన్న సంశయం మాత్రం ఉంది. ఏదైతేనేమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా అంటూ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాల్లో ఒకటి రెండు మినహాయిస్తే మిగతా స్థానాల నుంచి ఒక్కో పేరు చొప్పున సిఫారసు చేసినట్లు ఆ లేఖలో ఉన్నట్లు సమచారం. గెలుపోటములు ఎలా ఉన్నా ఆ జాబితాపై కొందరిలో ఆసక్తి, మరికొందరిలో అనాసక్తి నెలకొంది. అయితే ఇది ఎప్పటిదో ఇతమిద్దంగా తెలియకున్నా ఉత్కంఠ నెలకొంది.

జిల్లాలోని రెండు లోకసభ స్థానాల్లో ఎంపీలుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆ జాబితాలో చోటు ఉండటం గమనార్హం. ఉత్తమ్ కు హుజూర్ నగర్, కోమటిరెడ్డికి నల్లగొండ స్థానాల నుంచి పేర్లు ఉన్నాయి.

నాగార్జున సాగర్ నుంచి మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి పేరు ఉంది. మిర్యాలగూడకు జానారెడ్డి, ఆలేరు బీర్ల అయిలయ్య, భువనగిరి నుంచి కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగగుర్తి నుంచి అద్దంకి దయాకర్, దేవరకొండ నుంచి కిషన్ నాయక్ లేదా బాలూనాయక్ పేర్లున్నాయి.

అదే విధంగా సూర్యాపేట నుంచి దామోదర్ రెడ్డి లేదా పటేల్ రమేశ్ రెడ్డి, కోదాడ నుంచి ఉత్తమ్ పద్మావతి పేర్లు ఉన్నాయని తెలిసింది. మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరు ఉన్నా పెన్నుతో రౌండప్ చేసి ఉన్నట్లు సమాచారం. నకిరేకల్ విషయంలో సందిగ్ధం ఉన్నట్లు సమాచారం.