చంద్రబాబు, కేసీఆర్ పై కాంగ్రెస్ నేత సెటైర్

అప్పట్లో భుట్టో.. ఇప్పట్లో ముషరప్ అని ఓ సినిమాలో పెట్టిన సెటైరికల్ జోక్ తెగ పేలింది. అయితే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కలిసి ఉన్న పాత ఫొటోను తాజాగా ట్విట్టర్లో షేర్ చేస్తూ ఓ కాంగ్రెస్ నేత పెట్టిన క్యాప్షన్ వైరల్ గా మారింది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రి వర్గంలో కేసీఆర్ పనిచేశారు.

తాజాగా సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, ఆయన జాతీయ పార్టీని స్థాపిస్తారని విశేష ప్రచారం ఉంది. దేశ రాజకీయాల్లో సమూల మార్పు తేవాలంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.

గతంలో చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జాతీయ రాజకీయాలను శాసించారంటే అతిశయోక్తి కాదు. ఓ దశలో ప్రధానమంత్రి అవుతారని ప్రచారం కూడా జరిగింది. అనూహ్య రీతిలో ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగారు.

సీన్ కట్ చేస్తే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారని, కీలక భూమిక పోషిస్తానని స్వయంగా ఆయనే ప్రకటించడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. దీంతో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేసింది.

ఈ దశలో కాంగ్రెస్ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి ట్విట్టర్లో షేర్ చేసిన ఫొటో క్యాప్షన్ హల్చల్ చేస్తోంది. చంద్రబాబు, కేసీఆర్ కలిసున్నప్పటి ఫొటోను ట్యాగ్ చేస్తూ ‘‘అప్పట్లో కాబోయే ప్రధానమంత్రితో ఇప్పట్లో కాబోయే ప్రధానమంత్రి’’ అన్న క్యాప్షన్ పెట్టారు.

అయితే వంశీచంద్ రెడ్డి పోస్టు నవ్వుకోవడానికి పెట్టారా, విమర్శకోసం పెట్టారో కానీ.. ఆయన పోస్టుకు అనుకూలంగా రీట్వీట్లు ఎన్నో వస్తున్నా, అటు చంద్రబాబు, ఇటు కేసీఆర్ అనుకూలుర నుంచి వ్యతిరేక రీట్వీట్లు కూడా వస్తుండటం గమనార్హం. ఏదేమైనా ఆ ట్వీట్ మాత్రం జనాలను ఆలోచనల్లో పడేసింది.