భారతదేశంలో రాజకీయాలు అత్యున్నత శిఖరంగా మారాయి. ఏ రంగంలో విశిష్ఠ ప్రాముఖ్యత సాధించినా అంతిమంగా రాజకీయాల్లో చేరడం ఒక కలగా మలుచుకుంటున్నారు. అలా ఎందరో విభిన్న రంగాల నుంచి అంతిమంగా రాజకీయ రంగాన్నే ఎంచుకున్నారు.
అలాంటి కోవలోకే ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేరిపోయారు. రాజకీయాలను మలుపు తిప్పే రణతంత్రం తెలిసిన ఆయన రాజకీయం రుచి చూద్దామని నిశ్చయించుకున్నారు. రాజకీయ పార్టీలో చేరాలనే తన నిర్ణయాన్ని మూడు నెలల క్రితమే ప్రకటించారు.
బీజేపీతో పడని ఆయన పలు విపక్ష పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించి విజయం సాధించారు. ఆ దశలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీలో చేరి ప్రధాన భూమిక పోషించాలని ఉవ్విళ్లూరారు.
అయితే ఆదశలో కాంగ్రెస్ అధిష్ఠానం కండీషన్లు పెట్టింది. అదే సమయంలో మరో పార్టీ కోసం ఆఫర్ వచ్చింది.. వెంటనే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదంటూ ప్రకటన గుప్పించారు.
బిహార్ వరకే పరిమితమవుతా.. మరో ఏడాది తర్వాత రాజకీయ ప్రకటన గురించి చెప్తా.. అని ఏవోవో ప్రకటనలు చేశారు. కానీ ఇప్పుడవన్నీ పటాపంచలు అయ్యే సమయం వచ్చింది. కాంగ్రెస్ ఆఫర్ ను ఎందుకు కాదనుకున్నారో తేలే సమయం వచ్చింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ తో సన్నిహితంగా మెలుగుతూ వచ్చిన ప్రశాంత్ కిషోర్ ఆయనకు చెందిన టీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తూ వచ్చారు. ప్రస్తుతం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. అప్పుడు హైదరాబాద్ వచ్చిన పీకే కేసీఆర్ తో సుదీర్ఘ మంతనాలు జరిపారు. ప్రస్తుతమూ హైదరాబాద్ వచ్చిన ఆయన మరోసారి చర్చలు జరుపుతున్నారు.
ఇప్పుడు తెలిసింది.. అసలు రహస్యం. కేసీఆర్ నేతృత్వంలో రానున్న జాతీయ పార్టీలో ప్రశాంత్ కిషోర్ చేరున్నారని విశ్వసనీయ సమాచారం. అందుకే కాంగ్రెస్ ఆఫర్ ను చివరి దశలో కాదనుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీలో పీకేకు కీలక పదవి ఆఫర్ ఇచ్చారని సమాచారం. కేసీఆర్ జాతీయ అధ్యక్షుడిగా, ప్రశాంత్ కిషోర్ ప్రధాన కార్యదర్శిగా నూతన పార్టీ అవతరించనుందని రాజకీయ విశ్లేషకుల అంచనా. మరి మున్ముందు ఏం జరగనుందో వేచి చూద్దాం.