వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

రచ్చబండ, మధిర : వైఎస్సార్ టీపీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధిర మండలం మడుపల్లి, అల్లీనగరం, బయ్యారం, బోనకల్లు మండలం మోటమర్రి, రాయనపేట, మోటమర్రి గ్రామాల్లో షర్మిల పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాల్సిన ప్రతిపక్షాలు మొద్దు నిద్రలో ఉన్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అందుకే ప్రజల పక్షాన పోరాడేందుకు, రాష్ట్రంలో రాజన్న రాజ్యాన్ని స్థాపించేందుకు తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించినట్లు షర్మిల స్పష్టం చేశారు.

కేసీఆర్ ఉద్యమకారుడు కదా అని రెండుసార్లు గెలిపిస్తే ఆయన ప్రజలనే వెన్నుపోటు పొడిచారన్నారు. తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గమంటూ లేదని ధ్వజమెత్తారు. 8 ఏళ్లుగా ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రజా సంక్షేమాన్ని మరిచి పాలన చేస్తున్నారని షర్మిల ఘాటుగా విమర్శించారు.

సీఎం కేసీఆర్ ప్రచారం కోసం ప్రజాధనాన్ని భారీ స్థాయిలో దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఆయన అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దునిద్ర పోతుందన్నారు. ప్రజల పక్షాన నిలబడేందుకే పార్టీ పెట్టానని తెలిపారు.

తాను వైఎస్సార్ రక్తమని, ప్రజలు ఆశీర్వదిస్తే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పాలనను తెలంగాణ రాష్ట్రంలో తీసుకొస్తానని షర్మిల పునరుద్ఘాటించారు.

రానున్న ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదిస్తే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని, ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తానని, రైతు రుణమాఫీ చేస్తానని, పోడు భూములకు పట్టాలు ఇస్తానని ఆమె ప్రకటించారు.

కేసీఆర్ చేతిలో మరోసారి రాష్ట్రాన్ని పెడితే సర్వనాశనం చేయడమే కాకుండా రాష్ట్రాన్ని బార్లు, బీర్ల తెలంగాణగా మారుస్తారని ఆమె ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల పక్షాన నిలబడే వైఎస్సార్ తెలంగాణ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టా రాంరెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు నీలం రమేష్, ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గడిపల్లి కవిత, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు మద్దెల ప్రసాదరావు, నియోజకవర్గ కోఆర్డినేటర్ దొంతమాల కిషోర్ కుమార్, జిల్లా నాయకులు శీలం చెన్నారెడ్డి, జ్ఞానేశ్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.