నమ్మక ద్రోహులు!

అందమైన వ్యాపారాలు.. ఆకర్షణీయమైన తాయిళాలు.. అందినకాడికి అప్పులు.. ఆనక కలరింగ్.. తిరిగి చూసే సరికి దివాళా తీస్తున్న వైనం. దీంతో జనం లబోదిబో.. ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో ఇటీవలే ముగ్గురు ఐపీ పెట్టిన వైనంపై బాధిత కుటుంబాలు దు:ఖసాగరంలో మునిగాయి.

మధిర : ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో పలువురు వ్యాపారులు తమ వ్యాపార అభివృద్ధి కోసం ఇతరుల వద్ద డబ్బులు తీసుకుంటున్నారు. తీరా వ్యాపారంలో నష్టం వచ్చిందని చెబుతూ కోర్టుల్లో ఇటీవలే పలువురు దివాళా పిటిషన్ దాఖలు చేయడంతో మధిర పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మధిరలో వ్యాపార అవసరాల నిమిత్తం అందినకాడికి అప్పులు చేసి తిరిగి అవి చెల్లించలేక, ఐపీ దాఖలు చేసిన సంఘటనలు వరుసగా జరగడంతో మధిర ప్రజలు ఆవేదన చెందుతున్నారు. మధిరలో కొంతమంది వ్యక్తులు నమ్మకంగా, స్నేహం చేసి అవసరాలకు డబ్బు తీసుకొని ఐపీ పెట్టడం సర్వసాధారణంగా మారింది.

రూ.1.75 కోట్లకు టోపీ
ఓ ఎంటర్ ప్రైజెస్ పేరుతో మధిర పట్టణంలోని రాయపట్నం రోడ్డులో కిరాణా దుకాణం నడుపుతున్న ఓ వ్యక్తి రూ.1.75 కోట్లకు సత్తుపల్లి కోర్టులో ఐపీ దాఖలు చేశారు. దీంతో ఆయనకు అప్పిచ్చిన బాధితులు లబోదిబోమంటున్నారు. ఫిబ్రవరి 18వ తేదీన తక్కువ ధరకు బైకులు, ల్యాప్ టాపులు, కుట్టుమిషన్లు ఇప్పిస్తానని నమ్మబలికి పట్టణానికి చెందిన పలువురి వద్ద నుంచి భారీ స్థాయిలో డబ్బులు తీసుకొని ఉడాయించాడు.

రూ.3.10 కోట్లకు ఎసరు
పైఘటనను మరువకముందే మధిర పట్టణానికే చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి పలువురి వద్ద అప్పు తీసుకొని అవి చెల్లించకుండా రూ.3.10 కోట్లకు సత్తుపల్లి కోర్టులో ఐపీ దాఖలు చేశారు.

రూ.85 లక్షల దివాళా
గతంలో మధిర పట్టణంలోని వైరా రోడ్లో ఓ ఆటోమొబైల్ షాపు ఏర్పాటు కోసం ఒకాయన వ్యాపార అభివృద్ధి కోసం స్నేహితులు, బంధువుల వద్ద అందినకాడికి అప్పులు తెచ్చాడు. వాటిని తీర్చలేక రూ.85 లక్షలకు ఖమ్మం కోర్టులో దివాళా పిటిషన్ దాఖలు చేశాడు. అదే విధంగా ఒక కారు డ్రైవర్ సైతం రూ.25 లక్షలకు సత్తుపల్లి కోర్టులో ఐపీ దాఖలు చేశాడు.

రెడీగా ఇంకొందరు?
ఇంకా పలువురు అయినకాడికి అప్పలు చేసి ఎగ్గొట్టేందుకు రెడీగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మధిరలో ఒక వ్యాపారి రూపాయ వడ్డీకి రూ.3 కోట్లు తీసుకొని అవి చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అంటున్నారు. పట్టణానికి చెందిన ఒక బేకరీ వ్యాపారి అందరితో నవ్వుతూ మాట్లాడి రూ.రెండు కోట్ల వరకు అప్పులు చేసి ముఖం చాటేశారని ఆరోపణలు. ఓ కోల్డ్ స్టోరేజ్ వ్యాపారి రూ.కోటి తీసుకొని కనిపించకుండా వెళ్లారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అప్పులు చేసి ఎంచక్కా..
చిన్న స్థాయిలో తమ ఇంట్లో పెళ్లి అని, ఇంట్లో వాళ్లకి బాగాలేదని, పిల్లల చదువుల పేరు చెప్పి రూ.10 వేల నుంచి రూ.10 లక్షల వరకు స్నేహితులు, బంధువుల వద్దే తీసుకొని కొందరు కనిపించకుండా తిరుగుతున్నారు. మనతో పాటు కలిసి పనిచేసే వ్యక్తి ఆపదలో ఉన్నాడని, మానవత్వంతో ఇంట్లో దాచుకున్న డబ్బు ఇస్తే తిరిగి అవి ఇవ్వకుండా, వడ్డీ వ్యాపారం చేయడం నేరమంటూ కొందరు బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నారు.

నిజమైన అవసరాలకు పుట్టని అప్పు
నమ్మక ద్రోహుల దెబ్బకి మధిర పట్టణంలో నిజంగా ఎవరికైనా డబ్బులు అవసరమైతే డబ్బులు ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీనివల్ల ఆపదలో ఉన్న వారికి అవసరానికి డబ్బు దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.