విశ్వక్ చేసిన తప్పేంటి?

తన సొంత కాళ్లపై నిలదొక్కుకొని అనతి కాలంలో తెలుగు సినీ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నాడు విశ్వక్ సేన్. కేవలం ఐదు సినిమాలతోనే హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకొని దూసుకుపోతున్న విశ్వక్ మరికొన్ని సినిమాలు చేతిలో ఉంచుకొని క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

తెలంగాణ యాస, భాషతో సినిమాలు చేస్తూ వస్తున్న విశ్వక్ ను ప్రేక్షకులు స్వీకరించారు. ఆయన కూడా మంచి కథనాలు ఎంచుకొని, ప్రేక్షకులకు మరింత చేరువయ్యే సినిమాల్లోనే నటిస్తూ మెప్పిస్తూ వస్తున్నారు.

అలాంటి హీరో విశ్వక్ పై తాజాగా విషప్రచారం ఎందుకు జరుగుతోంది.. ఎవరు చేస్తున్నారు.. చేయిస్తున్నది ఎవరు.. ఎందుకు చేస్తున్నారు.. అంత చులకన ఎందుకు.. అని అభిమానుల్లో, మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది.

తాజాగా ‘అశోక వనంలో అర్జున కల్యాణం’ సినిమా నిర్మాణం పూర్తయింది. విడుదలకు సిద్ధంగా ఉంది. ట్రైలర్ ను చూసిన ప్రేక్షకులు హ్యాపీ ఫీలయ్యారు. సినిమా విడుదల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఓ పెళ్లికి సంబంధించిన గమ్మత్తైన ముచ్చట్లు, సీన్లు, హీరో, హోరోయిన్ల ప్రేమ కలాపాలు, సూర్యాపేట (తెలంగాణ) వరుడు, ఆంధ్రా వధువుకు జరిగే పెళ్లి సమయంలో పూసే నవ్వుల జల్లు ట్రైలర్ లోనే మురిపించింది. ఇక సినిమాలో ఎలా ఉంటుందోనని ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

అయితే తాజాగా ఫిల్మ్ నగర్లో విశ్వక్ ఇంటి సమీపంలో ఓ యూట్యూబర్ ఆయనపై ఉన్న అభిమానంతో ఓ ప్రాంక్ వీడియో చేశాడు. అదీ విశ్వక్ తన ఇంటికి సమీపంలో కారులో వస్తుండగా, ముందుకొచ్చిన ఆ యూ ట్యూబర్ ప్రాంక్ చేశాడు.

అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాలో అర్జున్ కు 33 ఏళ్లయినా పెళ్లి కాలేదు. నేను చనిపోతా.. అంటూ ఆ యువకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడబోతాడు. దానిని విశ్వక్ స్వయంగా అడ్డుకొని నివారించి, తన కారులోనే ఆయువకుడిని అక్కడి నుంచి పంపించి వేస్తాడు. ఆయన మాత్రం ఓ ఆటోలో వెళ్తాడు. ఇదీ జరిగింది.

అయితే ఆ య్యూటర్ తాను పోసుకున్నది పెట్రోల్ కాదని, నీళ్లని తర్వాత తెలిసింది. అది ప్రాంక్ వీడియో అని తేలిపోయింది. దీనిని అందరూ టూకీగానే తీసుకున్నారు. సాఫీగానే వెళ్లిపోయారు.

ఇదేదో సమాజానికి విఘాతం కలిగిందని ఒకరు హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు. ఇదే సమయమనుకొన్న ఒకటి రెండు ప్రధాన టీవీలు విశ్వక్ పై విష ప్రచారానికి తెరలేపాయి. ఎంతగా అంటే అతనో పనికిమాలిన వెదవ అన్నంత రీతిలో దుష్ప్రచారం చేశాయి.

ప్రాంక్ పేరుతో పిచ్చి వేషాలు.. సినిమా ప్రమోషన్ కోసం ఇంత అరాచకమా.. చీఫ్ ట్రిక్స్.. అన్న ప్రధాన శీర్షికలతో విశ్వక్ పై ఆ చానళ్లు విషప్రచారం చిమ్మాయి. కనీసం అది ఆయన చేసిందా.. లేక అభిమానంతో వేరేవాళ్లు చేసిందా.. అన్న వివరణ కూడా తీసుకోరా.. డైరెక్ట్ క్యారెక్టర్ ను డ్యామేజీ చేస్తారా..అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

విశ్వక్ ఎవరూ చేయని తప్పేమైనా చేశారా.. దోపిడీ చేసినంత పని చేశారా.. ఎవరికైనా కనీసం అన్యాయం చేశారా.. ఎందుకింత కుసంస్కారం. ఆయనపై దుమ్మెత్తిపోయడం ఏమిటి.. ఇది క్షమించరాని విషయమని వేనోళ్ల నిరసిస్తున్నారు.

విశ్వక్ పై విషం చిమ్మడంపై అభిమానులు, మెజారిటీ ప్రేక్షకులు, ముఖ్యంగా తెలంగాణ వాసుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అదే పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, కనీసం నాని, శర్వానంద్ లాంటి హీరోలపై ఇలాంటి హెడ్డింగులు పెట్టి చులకన చేస్తారా.. అవమానిస్తారా.. అని ప్రశ్నిస్తున్నారు.

మరో విషయమేమిటంటే.. ఓ చానల్ స్టూడియోలో విశ్వక్ కు తీవ్ర అవమానం జరిగింది. చర్చ జరుగుతున్న సమయంలో గెటవుట్ మై చానల్.. అంటూ ఆ యాంకర్ గర్వంతో ఊగిపోవడంపై తెలుగు ప్రజల నుంచి నిరసన వెల్లువెత్తింది.

అదే వేరే సినీ హీరోలను, కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టులనైనా విశ్వక్ ను అవమానించినట్లుగా అవమానిస్తారా.. అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పోగా ఆ తర్వాత తన నోటి నుంచి ఓ పదం అనుకోకుండా వచ్చిందని, దానికి సారీ అంటూ ఆ తర్వాత విశ్వక్ చెప్పారు. దీనిని కూడా అసలు క్షమాపణ చెప్పారా.. అంటూ ఆ చానల్ గుచ్చిగుచ్చి ప్రశ్నించింది.

కానీ గురివింద నీతి మాదిరిగా ఓ గెస్ట్ ను అవమానకరంగా గెటవుట్ అన్న తమ యాంకర్ దీ తప్పేనని, పాగల్ సేన్ అని లక్షలాది మంది అభిమానులున్న విశ్వక్ సేన్ ను (ఎవరైనా కావచ్చు) ఆ యాంకర్ పిలవడంపై ఆ చానల్ క్షమాపణ చెప్పదా.. అంటూ తెలుగు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆ యాంకర్ దురుసు ప్రవర్తనపై ఆగ్రహంతో ఉన్నారు. దీనికి ఆ చానల్ తప్పక సమాధానం చెప్పాలి. దీనిలో పాగల్ ఎవరో ప్రజలే తేల్చుకున్నారు.

మొత్తంగా విశ్వక్ సేన్ ది రవంత తప్పు లేకున్నా ఆయనపై విషం చిమ్మడంపై తెలుగు ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. కేసు, చానల్ విష ప్రచారంపై ఆగ్రహంతో ఉన్నారు. ఇంకా ఎంతకాలం ఈ అణిచివేత అంటూ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు రగిలిపోతున్నారు.

తెలంగాణ నటులే తక్కువ.. ఉన్న కొద్దిమందికి తరచూ అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా.. అంటూ జ్వలించిపోతున్నారు. ఎప్పుడో ఒకప్పుడు ఇది రావణకాష్టంగా మారకముందే విషం చిమ్మే యత్నాలను మానుకోవాలని తెలంగాణ వాదులు, మేథావులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.