తీన్మార్ మల్లన్న దారెటు?

స్వతంత్ర రాజకీయ వాదిగా ఆరితేరిన తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీల ఒరలో ఇమడలేకపోతున్నారా.. ప్రశ్నించే తత్వమున్న జర్నలిస్టు కొందరిపైనే బాణం ఎక్కుపెట్టడం నచ్చడం లేదా.. సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచే ఈయన బీజేపీ కంటే కాంగ్రెసే ప్రత్యామ్నాయమని నమ్మారా.. అసలు వీరు నచ్చక వారు.. వారు నచ్చక వీరు.. మరి ఎవరూ నచ్చక సొంత రాజకీయమే నడపనున్నాడా..? దీనిపై రచ్చబండలో సమగ్ర విశ్లేషణ.

టీఆర్ఎస్, ముఖ్యంగా సీఎం కేసీఆర్ ఆయన కుటుంబంపై ఒంటికాలిపై లేచే క్యూ న్యూస్ అధినేత, జర్నలిస్టు, బీజేపీ నేత అయిన తీన్మార్ మల్లన్న కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. అంతకు ముందే ఆయనపై పలు కేసులు నమోదైన సందర్భంలో అరెస్టు అయి జైలు పాలయ్యారు.

తీన్మార్ మల్లన్న జైలులో ఉండగానే ఆయన భార్య బీజేపీ నేతలను కలిసి తన భర్తపై కేసుల విషయంపై ఫిర్యాదులు చేశారని, ఆయన బీజేపీలో చేరిక విషయమై విన్నవించుకున్నారని ప్రచారం జరిగింది.

అనంతరం ఆయన విడుదలయ్యాక అందరూ ఊహించినట్లుగానే తీన్మార్ మల్లన్న బీజేపీలో చేరారు. తాను సభ్యత్వం తీసుకున్న సందర్భంగా టీఆర్ఎస్ ను గద్దె దింపేందుకు వీరతాడుగా తాను సభ్యత్వాన్ని భావిస్తున్నట్లు చెప్పారు. అలాంటి మల్లన్న తాజా వ్యాఖ్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ దశలో కొంతకాలం బాగానే ఉన్నా, అనంతరం పొసగలేక పోతున్నారని త్వరలోనే వార్తలు బయటకు పొక్కాయి. బీజేపీలో చేరిన కొన్నాళ్ల నుంచే ఆయన కాంగ్రెసుపై అనుకూలంగా వ్యవహరిస్తూ వస్తున్నారని అందరూ బాహాటంగానే కొందరు చెప్పుకుంటూ వస్తున్నారు.

అదే విధంగా మల్లన్న చేసిన కొన్ని వ్యాఖ్యల విషయంలో బీజేపీ అధిష్ఠానం మందలించినట్లు తెలిసింది. అలాంటి వ్యాఖ్యల విషయంలో కంట్రోల్ గా ఉండాలని సూచించినట్లు తెలిసింది. అగో అక్కడే మనోడి ఇగో దెబ్బతిన్నదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అదే విధంగా తన బద్ధ వ్యతిరేకులు ఇటీవలే బీజేపీలో చేరడంతో దానికి ఆజ్యం పోసినట్లయింది. ఇదే గాక ఆపార్టీలో వర్గ రాజకీయాలతో తనకు పడదనుకున్నాడో ఏమో.. అప్పటి నుంచి బీజేపీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారని సమాచారం.

స్వతహాగా ముక్కుసూటిగా వ్యవహరించే తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీల ఒరల్లో ఇమడలేక పోతున్నారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. టీజేఎస్ లో ఆయనకు పొసగలేదు. కాంగ్రెసులో ఇమడలేకపోయారు. బీజేపీలోనూ కలవలేక దానికీ టాటా చెప్పనున్నట్లు ఆయన వైఖరే తేటతెల్లం చేసింది.

మరి ఈ దశలో మల్లన్న కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు విశేషంగా ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీలో ముఖ్యంగా రేవంత్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు మల్లన్నతో సానుకూలంగానే ఉన్నారని తెలిసింది. వారు కూడా తీన్మార్ మల్లన్నను పార్టీలోకి మొదట్లోనే ఆహ్మానించినట్లు చెప్తున్నారు. అయితే ఇప్పడు ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని చూస్తున్నట్లు పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తీన్మార్ మల్లన్న 7200 అనే ఒక స్లోగన్ తెచ్చారు. ఆ స్లోగన్ బీజేపీ కంటే గొప్పదంటూ చెప్పుకొచ్చారు. దాని అమలు కోసం పనిచేస్తామని, విద్య వైద్యంపై సమగ్ర విధానం తమ వద్ద ఉందని బహిర్గతం చేశారు. మరి దీనర్థం ఏమిటని విశ్లేషకులు ఓ అంచనాకు వస్తున్నారు.

ఇలాంటి స్వతంత్ర ఆలోచనలు ఉన్న తీన్మార్ మల్లన్న సొంతంగా పార్టీ పెట్టే ఆలోచనలోనే ఉన్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తన అనుయాయులతో తాజాగా ఘట్ కేసర్ లో సమావేశం కావడం చర్చనీయాంశమైంది.

తన ఉనికిని కాపాడుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం త్వరలోనే ఉందనే విషయమైతే అందరికీ స్పష్టంగా అర్థమవుతోంది. మరి తీన్మార్ మల్లన్న ఎలాంటి భవిష్యత్ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి మరి.