హైదరాబాద్ :కర్ణాటక రాష్ట్రంలోని కలుబుర్గి సమీపంలోని కమలాపూర్ వద్ద శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది హైదరాబాద్ వాసులు దుర్మరణం పాలయ్యారు. మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు కలుబుర్గి ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో కూడా కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది.
హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీరు అర్జున్ కుమార్ తన కూతురు పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సభ్యులు, బంధు, మిత్రులతో కలిసి గోవా వెళ్లారు. ఇక్కడే ఆరేంజ్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సును బుక్ చేసుకొని 32 మంది ప్రయాణికులతో పాటు ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ కలిసి 35 మంది వెళ్లారు.
గతనెల 28న వెళ్లన వారు 29వ తేదీన గోవా చేరుకున్నారు. అక్కడే మూడు రోజులు ఉన్న తర్వాత నిన్న రాత్రే బయలు దేరి వస్తుండగా కలుబుర్గి సమీపంలోని కమలాపూర్ వద్ద ఉదయం 5.50 గంటలకు అటుగా వెళ్తునన టెంపో వీరు ప్రయాణిస్తున్న బస్సును ఢీకొట్టింది.
ఈ ఘటనలో బస్సు అదుపు తప్పి కల్వర్టు నుంచి బోల్తా పడింది. డీజిల్ ట్యాంకు వద్ద ప్రమాదం జరగడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటల్లోనే నలుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు.
ఈ ప్రమాదంలో బస్సు కాలి బూడిదైంది. అర్జున్ సహా 8 మంది దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను కలుబుర్గి ఏరియా ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంచి చికిత్స అందజేస్తున్నట్లు సమాచారం.
మృతులు వీరే..
ఈ ఘోర దుర్ఘటనలో అర్జున్ (32), సరళ (32), డి.అర్జున్ (5), రవళి (30), శివకుమార్ (35), దీక్షిత్ (9), అనిత (40), హన్సిక మృతిచెందారు.