ఆన్ లైన్ గేమింగ్ పేరిట రూ.36 లక్షలు హాంఫట్

ఆన్ లైన్ జూదగాళ్ల బారిన హైదరాబాద్ బాలుడు

తల్లి ఖాతా నుంచి ఆడితే నగదు అంతా మాయం

ఆన్ లైన్ మెసాలు అంతా ఇంతా కాదు. వివిధ యాప్ ల ద్వారా పలు ఆన్ లైన్ సంస్థలు అందిన కాడికి గుంజుతున్నాయి. ఎందరో లక్షలాది రూపాయలు పోగొట్టుకొని బజారున పడ్డారు. తాజాగా వారి బారిన పడిన ఓ హైదరాబాద్ బాలుడితో ఆటాడి రూ.36 లక్షలను ఆన్ లైన్ మోసగాళ్లు గుంజుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నగరంలోని అంబర్ పేటకు చెందిన 16 ఏళ్ల వయసున్న ఓ బాలుడు తన తాత సెల్ తీసుకొని ఫ్రీ ఫైర్ గేమింగ్ యాప్ ను డౌన్ లోడు చేశాడు. తాత ఫోన్లోనే తన తల్లి బ్యాంకు అకౌంట్ నుంచి రూ.1,500తో ఆట మొదలు పెట్టాడు.

ఆ తర్వాత ఆ బాలుడు రూ.10 వేల చొప్పున డబ్బులు పెట్టి ఆడటం మొదలు పెట్టాడు. అలా హెచ్ డీఎఫ్సీ బ్యాంకు నుంచి రూ.9 లక్షలు గేమింగులో సమర్పించాడు. ఆ తర్వాత ఎస్బీఐ ఖాతా నుంచి ఒకసారి రూ.2 లక్షలు, మరోసారి రూ.1.60 లక్షలు, రూ.1.45 లక్షలు ఇలా విడతల వారీగా రూ.27 లక్షలు జూదగాళ్లు గుంజేశారు.

ఇలా ఆ బాలుడి తల్లి బ్యాంకు ఖాతాల నుంచి రూ.36 లక్షలు మాయమయ్యాయి. ఆ బాలుడికి తెలిసి జరిగిందా.. తెలియకుండా జరిగిందా.. ఇంత మొత్తంలో గేమింగ్ కు ఖర్చవుతుందా.. అని అనుమానం వ్యక్తమవుతోంది.

ఇదిలా ఉండగా తనకు డబ్బులు అవసరం ఉండి ఆ బాలుడి తల్లి బ్యాంకుకు వెళ్తే ఖాతా ఖాళీ అని అధికారులు సెలవిచ్చారు. హతాశురాలైన ఆమె తేరుకొని హైదరాబాద్ సైబర్ పోలీసులను ఆశ్రయించింది.

పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. హెచ్ డీఎఫ్సీ ఖాతా నుంచి రూ.9 లక్షలు, ఎస్బీఐ ఖాతా నుంచి రూ.27 లక్షలు పోయినట్లుగా పోలీసులు గుర్తించారు.

ఈ డబ్బు నా భర్త కష్టార్జితం. ఆయన సైబరాబాద్ పోలీసు శాఖలో ఉన్నతాధికారిగా పని చేసేవారు. ఆయన మృతితోనే ఆ డబ్బు వచ్చింది. ఉన్న డబ్బంతా పోయింది. ఎలా బతికేది.. అంటూ ఆ బాలుడి తల్లి పోలీసులకు చెప్పి వాపోయింది.