మునుగోడులో కామ్రేడ్ల మద్దతు అటేనా? టీఆర్ఎస్ వైపా.. కాంగ్రెసు జట్టా?

రచ్చబండ, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. జిల్లాలో ఆపార్టీల ప్రభ వెలిగింది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా జిల్లాలో సగం స్థానాలకు పైగా వామపక్షాలే గెలిచి నిలిచాయి. పొత్తులో కూడా వామపక్షాల ఆధిక్యతే కనిపించేది.

మునుగోడు నియోజకవర్గం కమ్యూనిస్టులకు పుట్టినిల్లు లాంటిది. ఇక్కడ సీపీఐ ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించినా, సీపీఎం కూడా ప్రాధాన్యం కలిగిన స్థాయిలో ఓటింగ్ కలిగి ఉండేది. పొత్తులో మాత్రం సీపీఐకే సీటు దక్కేది.

గతంలో మునుగోడు నియోజకవర్గం నుంచి సీపీఐ మిత్ర పక్షాల మద్దతుతో ఐదుసార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించింది. ఇప్పటికీ రెండు పార్టీలకు కనీసం 15 వేల నుంచి 20 వేల వరకు ఓట్లు ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు. దీంతో వారి ఓట్లకు ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇప్పటికీ మునుగోడు నియోజకవర్గం పరిధిలో సీపీఐ, సీపీఎం ఓట్ల శాతం బాగానే ఉంది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, మునుగోడు మండలాల్లో సీపీఎంకు కొంత బలం ఉండగా, చండూరు, మర్రిగూడ, నాంపల్లి మండలాల్లో సీపీఐకి బలముంది. ఒకింత సీపీఐకే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది.

రానురాను రాష్ట్రంలో కమ్యూనిస్టుల ప్రభ వెలిసి పోయింది. జిల్లాలో కూడా ఒక్క అసెంబ్లీ సీటు కూడా గెలిచే స్థాయిలో వామపక్షాల బలం లేకపోవడం గమనార్హం. అక్కడక్కడా స్థానిక సంస్థల్లో ప్రాతినిథ్యం ఉన్నా నాటి ప్రాబల్యం తగ్గిపోయిందనేది వాస్తవం.

ఈ దశలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆ పార్టీకి, పదవికి రాజీనామా చేశారు. బీజేపీలో చేరి మళ్లీ పోటీకి సిద్ధమయ్యారు.

అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు రేవంత్ రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉంది.

ఈ సంకుల సరమరంలో వామపక్షాలు పోటీలో ఉంటాయా.. ఏదైనా పార్టీకి మద్దతు ఇస్తాయా.. అన్న అంశం ఉత్కంఠగా మారింది. గెలిచే స్థోమత ఆ పార్టీలకు లేకున్నా సీపీఎం మద్దతుతో సీపీఐ పోటీలో ఉంటుందా.. ఇద్దరూ కలిసి వేరే పార్టీకి మద్దతు ఇస్తాయా.. చెరో పార్టీకి అండగా నిలుస్తాయా.. అన్నది తేలాల్సి ఉంది.

వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేకతతో ఉన్నాయి. కాబట్టి ఆ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇవ్వబోవు. అధికార టీఆర్ఎస్ పార్టీకైనా, కాంగ్రెస్ పార్టీకైనా మద్దతు ఇచ్చే విషయంలోనే స్పష్టత రాలేదు. దీనిపైన కార్యకర్తల్లో, రాజకీయ విశ్లేషకుల్లో అయోమయం నెలకొంది.

ఇక్కడ మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికే రేపు జరిగే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అన్ని పక్షాలు భావిస్తున్నాయి. ఈ దశలో ఇప్పటి పొత్తే వచ్చే ఎన్నికల్లోనూ కొనసాగేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

2004లో రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండగా సీపీఎం నేతృత్వంలో వామపక్షాలు ఉధృత పోరాటాలు చేశాయి. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు వైఫల్యాలకు తోడు వామపక్షాల పోరాటం, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర కారణంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనేది నిర్వివాదాంశం.

ఇలాంటి తరుణంలో అధికార టీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలంటే కాంగ్రెస్ తోనే జట్టు కట్టేందుకు వామపక్షాలు మొగ్గు చూపుతాయా.. లేదా.. అన్నది వేచి చూడాలి. అయితే ఇప్పటివరకు ఆ దిశగా అడుగులు పడలేదు. కేవలం ఈ ఎన్నికకు తమకు మద్దతు ఇవ్వాలంటూ కాంగ్రెస్ నేతలు వామపక్షాలకు పిలుపునిచ్చారు.

టీఆర్ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం సవ్యంగా సాగుతుందని, ప్రజలు సుభిక్షంగా ఉన్నారని వామపక్షాలు భావించి ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తాయా.. అన్న అంశమూ ఉంది. ఈ విషయంలో ఇప్పటికే జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి వామపక్షాలు తమకే మద్దతు ఇవ్వాలంటూ కోరారు.

గతంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో ఇదే వైఖరితో సీపీఎం అధికార పార్టీకి మద్దతుగా నిలిచింది. ఎందుకు టీఆర్ఎస్ కు మద్దతు ఇస్తున్నామోనన్న విషయాన్ని ఆ పార్టీ స్పష్టత చేయలేదు. దీనిపై ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం, క్షేత్రస్థాయి కేడర్ లో విబేధాలు పొడచూపాయని బయటకు పొక్కింది.

వచ్చే అసెంబ్లీ సాధారణ ఎన్నికలకు పొత్తుల విత్తులు విచ్చుకోక ముందే వచ్చిన ఉప ఎన్నికతో ఎవరి వైపు నిలవాలోనని వామపక్షాల్లో సంశయం నెలకొంది. ప్రజాభిప్రాయాన్ని, క్షేత్రస్థాయిలో కేడర్ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటాయా.. నాయకత్వ స్థాయిలో తమకు తోచిన నిర్ణయం తీసుకొని మరో చారిత్రక తప్పిదానికి కారణమవుతాయో వేచి చూడాలి.