మునుగోడు ఎన్నిక ఖర్చు అంచనా మైండ్ బ్లోయింగ్.. ఒక్కో పార్టీ అంత పెడుతుందా?

రచ్చబండ ప్రతినిధి, మునుగోడు : వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అన్ని రాజకీయ పక్షాలు భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో ఒక్కో పార్టీ ఖర్చు అంచనా ఎంతో తెలుసా.. మైండ్ బ్లోయింగ్ అయ్యేంతలా ఉంది. అంత భారీ ఖర్చు పెట్టలేరనే బీసీ నేతలకు అధిష్టానాలు చెయ్యిచ్చాయి.. తామూ అంత ఖర్చు పెట్టలేమని వారు కూడా వెనుకడుగు వేయాల్సిన పరిస్థితి దాపురించింది.

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. దీంతో సిట్టింగ్ స్థానం దక్కించుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎలాగైనా మునుగోడు స్థానాన్ని దక్కించుకొని వచ్చే ఎన్నికల్లో ఆధిపత్యం తమదేనని రుజువు చేసుకునేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఓడితే ముప్పు తప్పదని ఆ పార్టీ భావిస్తోంది.

వచ్చే ఎన్నికల్లో గెలిచి నిలిచేందుకు మునుగోడులో జయకేతనం ఎగురేసేందుకు బీజేపీ చాపకింద నీరులా పావులు కదుపుతోంది. గెలిచేంత బలం లేకున్నా గెలిచి నిలిచేంత బలం తెచ్చుకునేందుకు సర్వ శక్తులు ఒడ్డుతోంది.

ఈ దశలో బీసీల ఓటింగ్ శాతం అధికంగా ఉన్న మునుగోడు నియోజకవర్గంలో ప్రతీ ఎన్నికల్లో ఆ వర్గాల నేతలకు నిరాశే ఎదురవుతోంది. ఈసారి బీసీ నేతలకే టికెటివ్వాలని కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి మొదట డిమాండ్లు వచ్చాయి.

ప్రతిష్ఠాత్మకంగా ముందుకొచ్చిన మునుగోడు ఎన్నికల్లో భారీ ఖర్చుకు మూడు పార్టీలు తెరలేపాయి. బీజేపీకి లేని ఓటింగ్ శాతాన్ని తెచ్చుకునేందుకు రాజగోపాల్ రెడ్డి తన శక్తియుక్తులన్నింటినీ ధారపోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఒక ఎంపీపీతో పాటు పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. వారికి భారీగానే ముడుపులు ముట్టజెప్పారని వైరివర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇంకా నేతల కొనుగోళ్లకు భారీ ఆఫర్ ఇస్తామని ఆశ చూపుతున్నారని ఆరోపణలున్నాయి.

అధికార టీఆర్ఎస్ పార్టీలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు నేతలు, కొందరు ప్రజాప్రతినిధులు చేరారు. సొంత పార్టీ ప్రజాప్రతినిధులను కాపాడుకునేందుకు అడ్వాన్సులు ఇచ్చి అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేసిందని ప్రచారం. అంటే అధికార పార్టీ కూడా ముడుపుల మూట విప్పిందని గుసగుసలు.

అంతర్గత కుమ్ములాటల కారణంగా, రేవంత్ రెడ్డికి కరోనా కారణంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా సర్దుకోకున్నా ఓ అంచనాకు అయితే వచ్చిందని తెలిసింది. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టుగానే భారీ ఖర్చుకు వెనుకాడని నేతకే సీటు ఖరారు చేసే అవకాశముందని తెలిసింది.

తమకే సీటు కేటాయించాలంటూ అటు కాంగ్రెస్, ఇటు టీఆర్ఎస్ లో మొదట బీసీ నేతలు రాగం అందుకున్నారు. ప్రస్తుతం ఆ రాగం నెమ్మదించింది. ఎందుకంటే భారీ ఖర్చు భరించలేరనే విషయం చర్చకు వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానమే ఖర్చు పెట్టుకుంటుందన్న ప్రచారం ఉన్నా అభ్యర్థి కూడా భారీగానే పెట్టుకోవాల్సి ఉందనే ఆలోచన ఉంది.

ఈ దశలో బీజేపీ నుంచి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అభ్యర్థిత్వం ఖరారు కానుండగా, కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థిత్వాల విషయంలోనే ఎవరనేది తేలలేదు. ఈ విషయంలో ఆయా పార్టీల అధిష్ఠానాలు బీసీ నేతలను వెనక్కి నెట్టేశాయని ప్రచారం జరుగుతోంది.

అధిష్ఠానాల వద్దకు వెళ్లిన బీసీ నేతల ముందు ఎన్నికల ఖర్చు విషయం లేవనెత్తినట్లు తెలిసింది. ఎంతంటే సుమారు రూ.100 కోట్లు పెట్టగలరా అంటూ బీసీ నేతలను ఆయా పార్టీల అధినేతలు ప్రశ్నించారని సమాచారం.

నేతలు, ప్రజాప్రతినిధుల కొనుగోలు, ఓటర్లకు తాయిళాలు, మద్యం, సొంత పార్టీ ప్రచారం తదితర ఖర్చులు కలుపుకొని అటూ ఇటుగా సుమారు రూ.100 కోట్లవుతుందని ఓ అంచనాకు వచ్చినట్లు భావిస్తున్నారు.

అంత ఖర్చు తాము భరించలేమంటూ బీసీ నేతలు మెల్లిగా వెనక్కి తగ్గినట్లు విశ్లేషకులు అంటున్నారు. దీంతోనే టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు అవకాశం సన్నగిల్లిందని అంటున్నారు.

దీన్ని బట్టి మూడు పార్టీలు కలిపి మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో సుమారు రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తాయన్న మాట. అధికార పార్టీకి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అదనంగా ప్రభుత్వ ఖర్చు ఉండటం వేరే విషయం.

మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే కాస్ట్లీ ఎన్నిక కానుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాయిళాల విషయానికి వస్తే పండుగే పండుగని ఎక్కువ మంది ఓటర్లు మురిసిపోతున్నారు.