బండి సంజయ్ అరెస్టు.. కరీంనగర్ తరలింపు.. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనలు

రచ్చబండ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ను మంగళవారం అరెస్టు చేశారు. బీజేపీ శ్రేణులు అడ్డుకున్నా.. వారిని తోసి పడేసి సంజయ్ ను వాహనంలో కరీంనగర్ తరలించి, హౌజ్ అరెస్టు చేశారు. సంజయ్ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వచ్చిన ఆరోపణలపై సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆమె రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి వివిధ కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.

బీజేపీ కార్యకర్తల అరెస్టును నిరసిస్తూ ప్రజాసంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మండలం పామ్నూరులో బస చేసిన చోటే ధర్మ దీక్షకు దిగారు. ఈ మేరకు సంజయ్ ధర్మ దీక్షను పోలీసులు భగ్నం చేశారు.

ఈ క్రమంలో సంజయ్ అరెస్టును బీజేపీ శ్రేణులు తీవ్రంగా ప్రతిఘటించారు. వారి అడ్డు తొలగించుకొని ఆయనను కారులో కరీంనగర్ తరలించారు. అక్కడ ఆయన ఇంటిలో వదిలేసిన పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు.

బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా శాంతియుత ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

టీఆర్ఎస్ పార్టీ అక్రమాలను బయట పెడుతున్నందుకే తనను అరెస్టు చేశారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. శాంతియుతంగా దీక్ష చేస్తున్న తనను అరెస్టు చేయడం అక్రమమని పేర్కొన్నారు. తాను చేపట్టిన యాత్రను ఆపేదిలేదని, ఎట్టి పరిస్థితుల్లో యాత్ర కొనసాగిస్తామని సంజయ్ స్పష్టం చేశారు.