విషాదాంతమైన ఫేస్ బుక్ ద్వారా ఒక్కటైన మైనర్ల ప్రేమ వివాహం

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : తెలిసీ తెలియని వయసులో ప్రేమ, వివాహాలు అయోమయానికి నెట్టి వేస్తాయి. చాలా మటుకు అర్ధంతరంగా ముగుస్తాయి. అలాంటి కోవకే చెందిన ఓ ప్రేమ వివాహం విషాదాంతంగా మిగిలింది.

సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్లకు ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. కొంతకాలానికి వారి మధ్య స్నేహం పెరిగి ప్రేమగా మారింది. అది కాస్తా పెళ్లి చేసుకునేదాకా దారి తీసింది.

తమ ఇళ్లల్లో పెద్దలు తమ పెళ్లిని ఒప్పుకోరని మైనర్లిద్దరూ అనుకున్నారు. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఇళ్ల నుంచి పారిపోయి వివాహం చేసుకున్నారు.

బాలిక, బాలుడి కుటుంబాల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వారిద్దరినీ వెతికి పట్టుకొచ్చారు. ఇద్దరికీ పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులను స్టేషన్ కు రప్పించి అవగాహన కల్పించి, ఎవరిళ్లకు వారు వెళ్లేలా ఒప్పించి పంపారు.

ఇంటికి వెళ్లాక ఇద్దరూ మదన పడ్డారు. ఇంటిలో ఉంటూ ఇద్దరూ ఆలోచనల్లో పడ్డారు. ఇక సాఫీగా ఉంటుందని ఆయా కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

ఈలోగా ప్రేమ విఫలమైందని భావించిందో, తామిద్దరం కలుసుకోలేమని అనుకుందో కానీ వారిలో బాలిక మనస్తాపంతో ఆగస్టు 15న ఆత్మహత్య చేసుకుంది.

ఈ విషయం తెలిసిన ఆ బాలుడు తన తోడు లేని ఈ లోకంలో నేనూ ఉండలేననుకున్నాడో ఏమో కానీ రెండు రోజుల అనంతరం మౌలాలీ సమీపంలో రైలు కింద పడి తనువు చాలించాడు.

తెలిసీ తెలియని వయసులో చిగురించిన ప్రేమ రోజుల అనంతరమే విషాదాంతంగా ముగియడం వారి తల్లిదండ్రుల్లో తీరని శోకం మిగిల్చింది.