కార్యాలయం కాదులెండి.. నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భవనంలో దొంగలు పడ్డారు. గత కొంతకాలంగా ఇక్కడ మెటీరియల్ అపహరణకు గురవుతున్నా తాజాగా సోమవారం వెలుగులోకి వచ్చింది. ఇదీ సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన కలెక్టరేట్ భవనంలో చోటుచేసుకుంది.
సూర్యాపేట పట్టణంలోని కుడకుడ రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ భవనంలో ఉంచిన మెటీరియల్ కొంతకాలంగా మాయమవుతోందని సమాచారం. మెటీరియల్ అపహరణపై అధికారులు నిఘా ఏర్పాటు చేసినా ఫలితం దక్కలేదని తెలిసింది. అయితే ఆదివారం రాత్రి సుమారు టన్నున్నర ఐరన్ మాయమైన విషయం సోమవారం వెలుగు చూసింది.
దీంతో విస్మయానికి గురైన కాంట్రాక్టర్లు వెతికే పనిలో పడ్డారు. పట్టణంలోనే ఖమ్మం రోడ్డులోని ఓ టెంట్ హౌజ్ లో ఆ ఐరన్ ప్రత్యక్షమైంది. దానిని చూసి ఖంగుతిన్న కాంట్రాక్టర్లు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. ఎంత కాలం నుంచి జరుగుతుంది.. ఎంత మేరకు తస్కరించారు.. ఎవరెవరి ప్రమేయముంది.. అన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకూ మాయమైన సామగ్రి విలువ సుమారు రూ.15 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఏకంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనానికే కన్నం వేసిన దొంగలెవరనే విషయం పోలీసుల విచారణలో బహిర్గతం కానుంది.