• రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్
నిఘా, మధిర : జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరానికి దీటుగా మధిర పట్టణాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. మధిర పట్టణంలో సోమవారం జరిగిన వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మల్లాది వాసు ఇంటి వద్ద పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కుట్టుమిషన్లను పేదలకు పంపిణీ చేశారు.
అనంతరం మల్లాది వాసు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి పువ్వాడ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో మధిరలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మధిర ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేసినట్లు వివరించారు.
మధిర చెరువు కట్టపై ట్యాంక్ బండ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.5.75 కోట్లు మంజూరు చేసిందన్నారు. అదే విధంగా రూ.4.70 కోట్లతో సమీకృత మార్కెట్ ఏర్పాటు, రూ.5 లక్షలతో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు, రూ.24 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, రూ.1.40 కోట్లతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ నిర్మాణం, లక్షలాది రూపాయలతో సిమెంట్ రోడ్ల నిర్మాణం లాంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు.
జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ కోరిక మేరకు మధిరకు ప్రభుత్వం అత్యధికంగా నిధులు మంజూరు చేసిందని తెలిపారు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. పువ్వాడ ఫౌండేషన్, నామా సేవా సమితి ద్వారా కరోనా కష్టకాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించామన్నారు.
లోక్సభా పక్ష నేత ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి టీఆర్ఎస్ ఎనిమిదేళ్ల పాలనలో జరిగిందన్నారు.
జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ మధిర ప్రజలకు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడం జరిగిందన్నారు.
ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రైతు మేనిఫెస్టోను ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, మార్కెట్ చైర్మన్ చిత్తారి నాగేశ్వరావు, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్ పర్సన్ శీలం విద్యాలత వెంకట రెడ్డి, బొమ్మెర రామ్మూర్తి, టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కారుమూరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం
మధిర మండలంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మరి కొన్ని అభివృద్ధి పనులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ సోమవారం ప్రారంభించారు. మండలంలోని ఖమ్మంపాడు గ్రామంలో రూ.42 లక్షలతో నిర్మించిన 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన సహకార సంఘం గోడౌన్, ఎనిమిది లక్షలతో నిర్మించిన సహకార సంఘం భవనం చుట్టూ ప్రహరీని మంత్రి ప్రారంభించారు.
మధిర పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ కూడలిలో రూ.12 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం రూ.5.70 కోట్లతో చెరువు ఆధునికీకరణ, మినీ టాంక్ బండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మధిర బస్టాండ్ వద్ద రూ.4.50 కోట్లతో నిర్మించనున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఆర్వీ కాంప్లెక్స్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటీ 40 లక్షలతో ప్రతిష్టాత్మంగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు.
మధిర పట్టణంలో 9, 10 వార్డుల్లో ఎన్ఆర్ఐ మల్లాది యశ్వంత్ చౌదరి ఆర్థిక సహకారంతో కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత నిర్మించిన రూ.25 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైన్లలను మంత్రి ప్రారంభించారు.
పువ్వాడ ఫౌండేషన్ సమకూర్చిన 300 కుట్టు మిషన్లలను మధిర పట్టణ నిరుద్యోగ మహిళలకు ఉమెన్ ఎంప్లాయిమెంట్ స్వయం ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్న వారికి పువ్వాడ ఫౌండేషన్ చైర్మన్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు.
మండలంలోని ఆత్కూర్ క్రాస్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేన్ ను ప్రారంభించి దివంగత అబ్బూరి రామకృష్ణ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
మంత్రి పువ్వాడ వెంట ఎంపీ నామా నాగేశవరరావు, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ తాతా మధు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు, డీసీసీబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, విత్తనాభివృద్ధి సంస్ధ చైర్మన్ కోండబాల కోటేశవరరావు, మధిర మున్సిపల్ చైర్మన్ మొండితోక లత, వైస్ చైర్ పర్సన్ శీలం విద్యా లత వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ స్నేహాలత పాల్గొన్నారు.
ఇంకా రైతు సమన్వయ సమితి అధ్యక్షడు నల్లమల వెంకటేశ్వర రావు, డీసీసీబీ జిల్లా ఉపాధ్యక్షుడు దొండపాటి వెంకటేశ్వరావు, మార్కెట్ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, కౌన్సిలర్లు మల్లాది వాసు, సవిత తదితరులు పాల్గొన్నారు.