చిన్నజీయరుకు సీతక్క సంధించిన ప్రశ్నలివే..

హైదరాబాద్ : గిరిజనులు ఆరాధించే ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ వనదేవతలపై ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

జాతరపై బిజినెస్ చేస్తున్నారంటూ జీయర్ స్వామి గతంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. ఆయన వ్యాఖ్యలను పలువురు తీవ్రంగా ఖండించారు. దీనిపై ములుగు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకురాలు సీతక్క తనదైన శైలిలో స్పందించారు. చిన్న జీయర్ స్వామిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె అన్న మాటలు కింది విధంగా ఉన్నాయి.

‘ఓ ఆంధ్ర చిన్న జీయర్ స్వామి.. మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైన సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకారపూరితమైన మాటలు. మా తల్లులది వ్యాపారమా? మా దేవతల దర్శనానికి ఒక్క రూపాయి కూడా టికెట్ లేదు. వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి.

కానీ మీరు పెట్టిన 120 కిలోల బంగారం గల సమతా మూర్తి విగ్రహం చూడడానికి మాత్రం 150 రూపాయలు. భేషరతుగా చిన్న జీయర్ స్వామి క్షమాపణ చెప్పాలి. తల్లుల కీర్తి ప్రతిష్ఠలను సహించలేక మాట్లాడిన దుర్మార్గపు మాటలను వెనక్కి తీసుకోవాలి.

జీయర్ వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ కూడా స్పందించాలి. తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఉన్న సమక్క సారక్క కీర్తిని తగ్గించి మాట్లాడిన విధానాల మీద తెలంగాణ ప్రభుత్వ వైఖరిని తెలపాలి.” అంటూ సీతక్క వీడియో ద్వారా డిమాండ్ చేశారు.