కోమటిరెడ్డితో ప్రధాని ఏమన్నారో తెలుసా?

దేశ ప్రధాని నరేంద్రమోదీతో సోమవారం భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు అంశాలను ప్రధానికి వివరించానన్నారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో కోమటిరెడ్డి మాట్లాడారు. తాను కోరిన అరగంటలోనే అపాయింట్ మెంట్ ఇచ్చారని కోమటిరెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సమస్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారని కోమటిరెడ్డి చెప్పారు. ప్రధానికి కోమటిరెడ్డి విన్నవించిన అంశాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

– మూసీ నదిలో నీరు శుద్ధి చేయకుండా కిందికి వెళితే నల్లగొండ జిల్లాకు చెందిన లక్షలాది మంది ప్రజలు వివిధ రూపాల్లో చనిపోతున్నారు.
నమామి గంగ తరహాలో మూసీనది ప్రక్షాళన చేయాలి.

– మూసీ ప్రాజెక్టు గురించి చెప్పినవుడు మోడీ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి మూసీ ప్రక్షాళన చేయలేక పోయారన్నారు.

– హైదరాబాద్ నుంచి విజయవాడ హైవే 6 లైన్ నిర్మాణంపై చర్చించా. 2022 ఏప్రిల్ లో ప్రారభించాలి. జీఎంఆర్ సంస్థ హైవే నిర్మాణం చేపట్టకుండా ఆర్బిట్రేషన్ కు వెళ్లి మెండిగా వ్యవహరిస్తుంది. 2025లో చేపడు తామంటున్నారు. ఇప్పటికే గడ్కరీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లా. ప్రధాని సైతం ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. మంగళవారం హైదరాబాద్- విజయవాడ హైవే నిర్మణంపై సమీక్షించనున్నారు.

– జీఎంఆర్ నిర్మణం చేయకపోతే కొత్త సంస్థతో అయినా నిర్మాణం చెయిస్తామని గడ్కరీ అన్నారు. అవసరమైతే కోర్టుకు కూడా వెళ్లేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కొత్త హైవేలకు నంబర్ ఇచ్చే పని ప్రధాని కార్యాలయంలో ఉంది.

– నల్లగొండ, మల్లేపల్లి, భువనగిరి చిట్యాల రోడ్డు గురించి ప్రధానితో చర్చించా. మోడీ సానుకూలంగా స్పందించారు.

– తెలంగాణలో పెద్ద మైనింగ్ కుంభకోణం జరగబోతుంది. సింగరేణికి అలాట్ చేసిన మైన్ తో రూ.50 వేల కోట్ల కుంభకోణం జరగబోతుంది. సింగరేణి విషయంలో కోల్ ఇండియా గైడ్ లైన్స్ పక్కన పెట్టి కేసీఆర్ కుటుంబ సభ్యులకు మైన్ టెండర్ అప్పగించే ప్రయత్నం జరుగుతుంది. దీనిపై తప్పకుండా చర్యలు ఉంటాయని ప్రధాని అన్నారు.

  • దేశంలో అనేక కోల్ ఫీల్డ్స్ లో జాయింట్ వెంచర్ ఉన్నపుడు తెలంగాణలో ఎందుకు జరగదు. అవినీతి కాన్సర్ కన్నా ప్రమాదకరమైంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో ఆధారాలతో సహా వెల్లడించా.

– ఏ రంగాల్లో అవినీతి జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ పై దృష్టి పెడతామన్నారు. తాను చెప్పిన సమస్యలపై ప్రధాని మోడీ స్పందించి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా.