టీఆర్ఎస్@ బీఆర్ఎస్@ సోషల్ మీడియా

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశం గురించి ప్రకటన వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ విశేష ప్రచారానికి తెరతీసింది. జాతీయ స్థాయిలో ప్రధాన మీడియా, సోషల్ మీడియా పరంగా వచ్చిన విస్తృత ప్రచారంతో బీజేపీ మేనేజ్ చేస్తుందన్న ఆలోచన జనంలో ఉంది.

కేంద్రంలో బీజేపీ అవలంబించిన మీడియా ప్రచారాన్ని తామూ వాడుకోవాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు ఇటీవల ఢిల్లీలో రైతు దీక్ష, తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ సొంత రాష్ట్ర మీడియాతో పాటు ఇతర రాష్ట్రాల మీడియాలో విస్తృత ప్రచారం చేసుకుంది. దీనికోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది.

ఇదే కోవలో ఈనెలలోనే జాతీయ రాజకీయాల ప్రకటన వచ్చీ రాగానే సోషల్ మీడియాను టీఆర్ఎస్ విస్తరించింది. ఈ మేరకు బీఆర్ఎస్, పీఎం కేసీఆర్, కేసీఆర్ సైన్యం, బీఆర్ఎస్ సైనికులు, కేసీఆర్ సేన అంటూ పలు సోషల్ మీడియా గ్రూపులు వెలిశాయి. ఆయా గ్రూపులను దేశవ్యాప్తంగా రన్ చేసే యోచనలో పార్టీ ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో ముఖ్య నేతల జాబితా తయారవుతోంది. ఆ మేరకు ముందుగా ఆయా రాష్ట్రాల్లో సోషల్ మీడియా గ్రూపులు ఏర్పాటు చేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. దానికోసం కొన్ని బృందాలను ఎంచుకొని వారికి బాధ్యతలు అప్పగించనున్నారు.

ఆయా మీడియా గ్రూపుల ద్వారా తెలంగాణ విజయవంతంగా అమలవుతున్న పథకాల గురించి ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా రైతుబంధు, రైతు బీమా, ఆసరా పింఛన్లు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ భగీరథ తదితర పథకాల గురించి విస్తృత ప్రచారం చేయనున్నారని తెలిసింది.