రచ్చబండ : సీఎం కేసీఆర్ రావాలి.. మంత్రి కేటీఆర్ రావాలి.. మా సమస్యలు తీర్చాలి.. అనే దాకా బాసర ట్రిబుల్ ఐటీ విద్యార్థులు డిమాండ్ వెళ్లింది. మంత్రి కేటీఆర్ ట్విట్టర్ కు వేలాది మంది విద్యార్థుల ట్వీట్లు వెళ్లాయి.
అర్ధరాత్రి, వర్షంలోనూ ఆందోళన కొనసాగించారు. పోలీసులు మోహరించి, ఆందోళనను అణిచేయాలని ఎంతగా ప్రయత్నించినా మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఇంతగా విద్యార్థుల్లో అసంతృప్తికి కారణమయ్యే సమస్యలేంటి అని అందరిలో ఉత్కంఠ కలగక మానదు.
నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ నాలెడ్జి టెక్నాలజీస్ యూనివర్సిటీ (ఆర్టీయూకేటీ)లో ఆరేండ్ల బీటెక్ ఇంటిగ్రేటెడ్ కోర్సులో సుమారు 8,000 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఏటా 1,500 మంది విద్యార్థులకు అడ్మిషన్లు కల్పిస్తున్నారు. కళాశాల విద్యార్థులు పలు మౌలిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
ఇక్కడ కీలకమైన అధికారులెవ్వరూ లేకపోవడం గమనార్హం. చాన్సులర్, వైస్ చాన్సులర్, డైరెక్టర్, రిజిస్ట్రార్ పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుతం సీఎంవో సెక్రటరీ రాహుల్ బొజ్జా ఇన్ చార్జి వీసీగా కొనసాగుతున్నారు. అయితే కిందిస్థాయి అధికారిని అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ (ఏవో)గా నియమించి బాధ్యతలన్నీ ప్రభుత్వం ఆయన చేతిలో పెట్టింది.
8వేల మందికి 19 మందే బోధనా సిబ్బంది
కళాశాలలో ప్రస్తుతం 8,000 విద్యార్థులు చదువుతున్నారు. వీరికోసం 146 బోధనా సిబ్బంది పోస్టులున్నాయి. వాటిలో కేవలం 19 మంది ఉన్నారు. అదీకూడా వారిలోనే ఐదుగురు లాంగ్ లీవ్ లో ఉన్నారు. కేవలం 14 మంది ఉండగా, మిగతా వారంతా కాంట్రాక్టు సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.
నాలుగేండ్లుగా ల్యాప్ ట్యాపులు, యూనిఫామ్ లేవు
ఆర్జీయూకేటీలో అడ్మిషన్ పొందిన ప్రతీ విద్యార్థికి ల్యాప్ టాప్ ఇచ్చేవారు. దీంతో పాటు రెండు యూనిఫామ్స్, ఒక స్పోర్ట్స్ డ్రెస్, షూస్ అందించేవారు. కానీ 2019-20 నుంచి వాటిని ఇవ్వడమే లేదు. ఏటా రూ.10 కోట్లు కేటాయిస్తే వాటిని సర్దేవారు. కానీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
శుద్ధి చేయని మంచినీరు సరఫరా
వర్సిటీలో ఒక్కో విద్యార్థి భోజనం కోసం రూ.95 ఇస్తున్నా కాంట్రాక్టర్లు నాసిరకం ఆహారం పెడుతున్నారని విద్యార్థులు చెప్తున్నారు. శుద్ధి చేయకుండానే మంచినీటిని సరఫరా చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు.
లైట్లు ఫ్యాన్లు పనిచేయవు
తరగతి గదులు, హాస్టళ్లలో ట్యూబులైట్లు, ఫ్యాన్లు సరిపడా లేవంటున్నారు. మూడేండ్ల కింద 100 ఏసీలు కొని గదుల్లో బిగించినా వాటికి కనెక్షన్లు ఇవ్వనేలేదు. ఇంకా మరెన్నో సమస్యలు ఏండ్లు అనుభవిస్తున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయాలు ఎలా ఉన్నా వేలాది మంది విద్యార్థులుండే యూనివర్సిటీలో పేరుకుపోయిన సమస్యలను వెంటనే తీర్చాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలూ డిమాండ్ చేస్తున్నాయి. ఏదేమైనా ప్రభుత్వం కనికరం చూపాలి మరి.