పాము కరిచిన బాలుడు మృత్యుంజయుడు.. సర్పమే మృత్యువాత

పాము కరిచిన ఓ బాలుడు మృత్యుంజయుడు అయ్యాడు. అదే పాము మాత్రం కరిచిన చోటే ప్రాణాలిడిసింది. ఇది వింతో, విపరీతమో కానీ యదార్థం. పాము ఎందుకు చనిపోయిందో తెలుసుకునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. తాజాగా జరిగిన ఈ ఘటన బిహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

మధోపూర్ గ్రామంలో రోహిత్, కుశ్వాలా కుమారుడైన అనూజ్ కుమార్ తల్లితో సహా కుచాయ్ కోట్ లోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నారు. తన అమ్మమ్మ ఇంటి ముందు ఆటలాడుకుంటుండగా ఓ పాము బాలుడిని కాటేసింది.

అనూజ్ ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్లి విషయం తల్లికి చెప్పాడు. ఆ వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడి ఆరోగ్యం బాగానే ఉందని ధ్రువీకరించారు.

ఇదిలా ఉండగా బాలుడిని కాటేసిన కొద్దిసేపటికే పాము అదేచోట చనిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దిగ్ర్భాంతికి గురయ్యారు. ఆ పామును ఓ డబ్బాలో ఉంచి అధికారులకు అప్పగించారు.

విష సర్పం కరిచిన బాలుడు క్షేమంగా ఉండటంతో అతడిని చూసేందుకు సమీప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.