రచ్చబండ : ఓ ముంబై మహిళ పట్టు వదలని విక్రమ శాలి అవతారమెత్తింది. తన నిరసనతో ప్రభుత్వ వైఖరినే ఎండగట్టింది. అప్పు చేసి అప్పనంగా తిరిగేవారిని వదిలేయొద్దని ‘గీత’ గీసింది. ఓ సంఘంగా చేయాల్సిన పనిని ఆమె ఒక్కరే చేసి చూపించింది. భర్త చెప్పినా వినని ఆమె కోర్టులోనూ భీష్మ ప్రతిజ్ఞ ప్రదర్శించింది. మొత్తానికి దేశ ప్రజల్లోనే ఆలోచనను రేకెత్తించి అసామాన్యురాలు అనిపించుకుంది.
ప్రేమలతా భన్సాలీ (44) కుటుంబం దక్షిణ ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలో ఉంటున్నది. ఆమె ముంబై సబర్బన్ రైలులో కావాలనే టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు.
టికెట్ లేనందుకు ఆ అధికారి రూ.260 జరిమానా చెల్లించమన్నాడు. అప్పుడు ఆమె చెప్పిన విషయంతో మనోడి దిమ్మ తిరిగిపోయింది.
విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఇండియాకు రప్పించి అతను బ్యాంకులకు అప్పుగా ఉన్న రూ.9 వేల కోట్లను కక్కించాలని, అప్పుడే తాను రూ.260 ఫైన్ చెల్లిస్తానని తేల్చి చెప్పింది. చివరకు కావాలంటే తాను ఏడు రోజుల జైలు శిక్షనైనా అనుభవిస్తాను కానీ, ఫైన్ మాత్రం చెల్లించనంది.
ఒకటి కాదు, రెండు కాదు దాదాపు 12 గంటల పాటు ఆమె రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూసన్నాయి నొక్కులు నొక్కుతున్న అధికారులు, సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ఆమె ప్రశ్నించారు.
చివరకు భన్సాలీ భర్తను అక్కడికి రప్పించారు. ఆయన ప్రయత్నమూ విఫలమైంది. ఇక తాను చేసేదేమీ లేదంటూ చేతులెత్తేశాడు. అంతా ప్రేమలతా ఇష్టమేనని స్పష్టం చేశారు.
ఏంచేయాలో తోచని రైల్వే పోలీసులు జుట్టు పట్టుకున్నారు. చివరకు ప్రేమలతను మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం చెల్లించనని, కావాలంటే జైలుకైనా వెళ్తానని సిద్ధపడింది.
ఇది ఓ మహిళ ఆవేదన కాదు. ప్రజల్లో పెల్లుబుకుతున్న నిరసనకు తార్కానం. పేదలను కొడుతూ పెద్దలకు పెడుతున్న పాలకులపై మొదటి నుంచీ నిరసన వ్యక్తమవుతూనే ఉన్నా.. వ్యవస్థలో మాత్రం మార్పు రాకపోవడం శోచనీయమని పలువురు మేథావులు అభిప్రాయపడుతున్నారు.