పార్టీ మారారు.. ‘పోడు’ మరిచారు

* ములుగు ఎమ్మెల్యే సీతక్క

గుండాల : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పోడు భూములకు పట్టాలు తీసుకువస్తామని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.. పార్టీ మారిన వారికి పదవులు వచ్చాయి.. కానీ నేటివరకు గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు రాలేదు.. అని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఎద్దేవా చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో శెట్టిపల్లి, శంభునిగూడెంలో ఆదివారం ఆమె పర్యటించారు. ఇటీవల మృతిచెందిన పలు కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా ఓ వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

పోడు భూముల సమస్యపై సీతక్క మాట్లాడుతూ పొడు భూములకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో అటవీ హక్కుల చట్టం ద్వారా పోడు భూములకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. కానీ కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల భూములు టీఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుందని అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కనీసం పోడు సమస్యపై మాట్లాడటం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రమే పోడు సమస్యపై అసెంబ్లీలో అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో పోడు సమస్య పరిష్కారం అయ్యేంతవరకు పోరాటాలు చేస్తామని అన్నారు. ప్రభుత్వం వెంటనే పోడు భూములకు పట్టాలు మంజూరు చేసి శాశ్వత పరిష్కారం చేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో మామకన్ను సర్పంచ్ ముత్యమాచారి, ముత్తయ్య, ఎస్కే సంధాని తదితరులు పాల్గొన్నారు.