బుల్లెట్టు బండెక్కి వచ్చేత్తపా!

బుల్లెట్టు బండెక్కి.. వచ్చేత్తపా.. వచ్చేత్తపా.. సంక్షేమ పథకాలు ఇచ్చొత్తపా.. ఇచ్చొత్తపా.. అన్నట్టుంది.. ఈ బుల్లెట్ బండిపై వెళ్తున్న వ్యక్తిని చూస్తే.. ఇదేంది ఇదేం పాట అనుకుంటున్నారా.. ఒక్కసారి అటెన్షన్ ప్లీజ్..
– మధిర

మధిర పట్టణం.. ఉదయం 11 దాటింది.. బుల్లెట్టు బండి చప్పుడు.. సుడిగాలిలా పలు ఇళ్లకు చేరుతున్నాడు.. చెక్కులు పంచుతున్నాడు.. వారిలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాడు.. ఆయనెవరు.. ఎందుకని అనుకుంటున్నారా.. విషయంలోకి రండి..

మధిర పట్టణంలో ఇటీవల అనారోగ్యాలతో పలువురు వైద్య చికిత్సలు పొందారు. వారికి సీఎంఆర్ఎఫ్ నుంచి ఆర్థికసాయం మంజూరైంది. దానికి సంబంధించిన చెక్కులను మంగళవారం లబ్ధిదారుల ఇల్లిల్లూ తిరుగుతూ పంచారు.. ఆయన ఎవరో కాదు.. ఆయనే ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు. దీంతో మధిర పట్టణవాసులు ఉత్కంఠగా చూసి విషయం తెలుసుకునేందుకు ఆస్తక్తి చూపారు.

మధిర పట్టణంలోని 8 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.3,50,500 విలువైన 13 చెక్కులను ఆయన అందజేశారు. తోటి ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, కునా నరేందర్ రెడ్డి, కనుమూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.