ఇదేంటి.. ఇదేం చిత్రం అనుకుంటున్నారా? మీరు విన్నది నిజమేనండి. ఇదో విచిత్రమే. కోతి చేష్టలు అంతా ఇంతా కాదు అంటుంటారు కదా. ఓ వానరం చేసిన చేష్టలు ఓ కేసుకే సవాల్ గా మారింది.
రాజస్థాన్ రాష్ట్రంలోని ఛాంద్వాజీ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో ఓ యువకుడి హత్య జరిగింది. ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. తాజాగా ఆ కేసు కోర్టు విచారణకు వచ్చింది.
సంబంధిత పోలీసులు కేసు సాక్ష్యాధారాలను ఓ బ్యాగులో పెట్టి స్టేషన్ ఆవరణలోని ఓ చెట్టు కింద ఉంచారట. ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో ఓ వానరం ఆచెట్టు వద్దకు దూసుకొచ్చింది. రెప్పపాటున సాక్ష్యాధారాలున్న బ్యాగును లంగించుకొని వెళ్లిపోయింది. చూస్తూనే ఉన్న పోలీసులకు ఆ మర్కటం అందకుండా పోయింది. ఎంతగా వెతికినా ఆ బ్యాగు మాత్రం పోలీసులకు కనిపించలేదు.
కోర్టు విచారణకు హాజరైన పోలీసుల వివరణ విని జడ్జి హతాశుడయ్యాడట. మరో విషయమేమిటంటే పోలీసులు సాక్ష్యాధారాలున్న బ్యాగును కోతెత్తుకెళ్లిందని రాతపూర్వకంగా కోర్టుకు సమర్పించారట. దీంతో కేసు విచారణపై సందిగ్ధం నెలకొంది. మర్కటం ఎంత పని చేసిందో చూడండి.