వివాహేతర బంధమే బలితీసింది

• జంట హత్యల కేసులో ట్విస్ట్

వివాహేతర బంధాలు ఎంతకైనా దారి తీస్తాయి. తన, మన అనే బంధాలనూ చెరిపేస్తాయి. ప్రాణాల మీదికీ తెస్తుంటాయి. ఫలితంగా కుటుంబాల్లో విషాదాలు అలుముకోనున్నాయి. నిత్యం ఇలాంటివి ఎన్నో జరుగుతున్నా గుణపాఠాలు రాకపోవడం శోచనీయం. అలాంటి కోవకే చెందిన ఈ ఘటన ఇరు కుటుంబాలకు శోకాన్ని మిగిల్చింది.

హైదరాబాద్ నగర సమీపంలో మేడే రోజున జరిగిన జంట హత్యల కేసులో ఉత్కంఠకు తెరపడింది. హైదరాబాద్ -విజయవాడ హైవేపై అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తగూడ బ్రిడ్జి కింద జరిగిన ఈ హత్య కేసు విషయం మంగళవారం వెలుగులోకి వచ్చింది. అయితే వారిద్దరినీ హత్య చేసింది ఎవరో బుధవారం తేలిపోవడంతో మిస్టరీ వీడింది.

మేడే రోజున ఓ వ్యక్తి, మహిళ బ్రిడ్జి కింద చనిపోయి ఉండటాన్ని మంగళవారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వారు తెలిపిన వివరాల ప్రకారం..

సికింద్రాబాద్ వారాసిగూడలోని బౌద్దనగర్ ప్రాంతానికి చెందిన యశ్వంత్ (22), అదే ప్రాంతానికి చెందిన జ్యోతి (30) మృతదేహాలుగా పోలీసులు గుర్తించి, విచారణ జరిపారు. యశ్వంత్ క్యాబ్ డ్రైవర్ కాగా, జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలున్నారు.

యశ్వంత్, జ్యోతికి వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ కలిసి తరచూ బయటకు వెళ్లి వచ్చేవారు. అదే విధంగా మే1న ఇద్దరూ కలిసి యశ్వంత్ సోదరుడి బైక్ పై కొత్తగూడ వద్దకు వెళ్లారు.

వారు తమ వెంట టార్చ్ లైట్, చాప, వాటర్ బాటిల్, స్ర్పైట్, ఫోన్ చార్జర్, ప్లాస్టిక్ పూలు తీసుకెళ్లారు. నగర శివారులోని కొత్తగూడ వద్దకు వచ్చి బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లి ఏకాంతంగా గడుపుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి వారిపై దాడి చేసి హతమార్చారు.

ఇక్కడే అసలు ట్విస్ట్ బయటపడింది. వారిద్దరి వివాహేతర బంధం జ్యోతి భర్త శ్రీనివాసుకు తెలిసిపోయింది. దీనిపై ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. మేడే రోజున వారు బయటకు వెళ్తారన్న విషయాన్ని ఆయన పసిగట్టాడు.

వారిద్దరినీ చంపేందుకు శ్రీనివాస్ సుపారీ గ్యాంగును మాట్లాడుకున్నాడు. అదే గ్యాంగుతో కలిసి ఆయన కూడా కొత్తగూడ వద్దకు వెళ్లాడు. వారిద్దరినీ ఏకాంతంగా చూసిన శ్రీనివాస్ రగిలిపోయాడు. తన భార్య ముందే యశ్వంత్ ను ఆయన దారుణంగా చంపేశాడు. యశ్వంత్ ను చంపొద్దంటూ జ్యోతి బతిమాలింది. దీంతో ఆమెనూ హతమార్చాడు.

జ్యోతి తల, మొఖంపై బండరాయితో మోది చంపారు. యశ్వంత్ తల, ఛాతీపై కొట్టడంతో పాటు స్క్రూడ్రైవర్ తో మర్మాంగంపై పొడిచి చిత్రవధ చేసి మరీ చంపినట్లు పోలీసులు తెలిపారు.