పరువు హత్యకేసులో సంచలన విషయాలు

ఐదుగురు దారుణంగా చంపేశారు
వెంటపడి.. ఇనుపరాడ్లతో వేటాడారు
కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు!
రోడ్డుపైనున్న అందరికాళ్లు మొక్కిన..
పాశవికంగా నా భర్తను పొట్టన పెట్టుకున్నరు
హతుడు నాగరాజు భార్య నిర్వేదం

హైదరాబాద్ : హైదరాబాద్ నగరం సరూర్ నగర్ పరిధిలో బుధవారం రాత్రి నడిరోడ్డుపై జరిగిన పరువు హత్యపై హతుడి భార్య సంచలన విషయాలు వెల్లడించింది. తమను వెంటాడి వేటాడి తన భర్తను తన కళ్లెదుటే హతమార్చారని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది. మంతాంతర వివాహం చేసుకున్న బిల్లాపురం నాగరాజు దారుణ హత్య ఘటన నగరంలో సంచలనంగా మారింది.

కాళ్లావేళ్లా పడ్డా కనికరించలేదు.. రోడ్డు పక్కనున్న వారిని చేతెలెత్తి వేడుకున్న, కాళ్లు పట్టుకున్నా ఎవరూ నా భర్తను కాపాడలేదు. ఐదుగురు వ్యక్తులు మమ్మల్ని వెంబడించారు. అడ్డగించి ఇనుప రాడ్లతో తీవ్రంగా నా భర్తను కొట్టారు. నేను అడ్డుకోబోతే పక్కకు నెట్టేశారు.. అని నాగరాజు భార్య ఆశ్రిన్ సుల్తానా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ చెప్పింది.

అసలేం జరిగింది..?
రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు (25), అదే జిల్లా పోతిరెడ్డిపల్లికి చెందిన ఆశ్రిన్ సుల్తానా కాలేజీ రోజుల నుంచే ప్రేమించుకుంటున్నారు. అయితే మతాలు వేరు కావడంతో యువతి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. దీంతో గత జనవరి 31న ఆర్యసమాజ్ మందిర్ లో నాగరాజు, సుల్తానా వివాహం చేసుకున్నారు.

పోలీసులను ఆశ్రయించినా..
నాగరాజు, ఆశ్రిన్ తమకు ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించినా దుండగుల నుంచి రక్షణ పొందలేకపోయారు. పెళ్లికి ముందే వారు వికారాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లి జరిగిన తర్వాత బాలానగర్ పోలీసులను ఆశ్రయించారు. బాలానగర్ ప్రాంతంలోనే కొంతకాలం నివాసమున్న వీరు గత రెండు నెలల క్రితమే సరూర్ నగర్ వచ్చి ఉంటున్నారు.

నాగరాజు ముసారాంబాగ్ లోని ఓ కార్ల షోరూంలో ఉద్యోగం చేస్తున్నాడు. బుధవారం నాగరాజు, ఆశ్రిన్ కలిపి బైక్ పై వస్తుండగా ఐదుగురు వ్యక్తులు అడ్డగించి నాగరాజును దారుణంగా హత్య చేశారు. గడ్డపార, ఇనుప రాడ్లతో తలపై తీవ్రంగా కొట్టి మరీ చంపారని ఆశ్రిన్ గురువారం విలపిస్తూ చెప్పింది.

తనను పెళ్లి చేసుకుంటే చంపుతారనే విషయం నాగరాజుకు తెలిసే చేసుకున్నాడని ఆశ్రిన్ చెప్పింది. తాము పెళ్లి చేసుకుంటే ఎలాగైనా చంపుతారన్న భయంతోనే నాగరాజుకు కనపడకుండా మూడు నెలలు దూరంగా ఉన్నానని, అయినా కాదనలేక పెళ్లి చేసుకున్నామని తెలిపింది. తామిద్దరం బంధువుల ఇంటికి వెళ్తుండగా ఐదుగురు కలిసి దాడి చేశారని చెప్పింది.