ఫర్ ద విశ్వక్ సేన్

విశ్వక్ సేన్.. తెలంగాణ భాష, యాసను సినిమాల్లో వాడుతున్న సినీ కథానాయకుడు. తెలుగు వెండితెరపై తెలంగాణ యాస అస్థిత్వానికి ఊపిరి పోస్తున్న పిడికెడు మందిలో ఆయన ఒకరు. హైదరాబాద్ నడిబొడ్డున నడయాడి, తెలంగాణ మట్టివాసనను పీలుస్తూ పెరిగిన విశ్వక్ సేన్ అదే యాసను తన సినిమాల్లో వాడుతూ ప్రేక్షకుల గుండెల్లో నిలిచాడు.

మరి అలాంటి విశ్వక్ సేన్ కు ఇటీవలే ఓ టీవీ చానల్ నుంచి ఘోర అవమానం జరిగింది. దానికి అనుకున్న రీతిలో తెలంగాణ వాసుల నుంచి స్పందన కానరాలేదు. ముందు వెనుకాల జరిగిన వాస్తవం, అవాస్తవాలు ఎలా ఉన్నా ఆయనకు జరిగిన అవమానం మాత్రం క్షమించరానిదని గుర్తించాలి.

సినిమా ప్రమోషన్ కోసం ఎవరికీ, ఎలాంటి హాని కలగకుండా రోడ్డు పక్కనే చిన్న (కేవలం 2 నిమిషాల పాటు) ప్రాంక్ వీడియో చేసినందుకు ఆ చానల్ విశ్వక్ సేన్ క్యారెక్టర్ ను డ్యామేజీ చేస్తూ వార్తలు ప్రసారం చేసింది. పిచ్చి వేషాలు, అరాచకం, బాధ్యత లేదా.. అంటూ ఆయనను ఘోరంగా అవమానించింది.

ఆనక ఆయనను స్టూడియోకు రప్పించి చర్చ జరుగుతుండగానే పాగల్ సేన్, డిప్రెస్డ్ పర్సన్ అని ఘోరంగా నిందించారు. ఆ తర్వాత గెటవుట్ మై స్టూడియో.. అంటూ తప్పేం లేకున్నా విశ్వక్ సేన్ ను ఆ యాంకర్ అవమానించింది. లక్షలాది మంది వీక్షకుల ముందు ఆయన చిన్నబుచ్చుకున్నారు. చాలా మందిలో బాధ కలిగింది. పదే పదే అంటుంటే ఓ మాట అన్నాడు.. అది తన తప్పేనని ఆ తర్వాత ఒప్పుకున్నాడు.

కానీ ఆ తర్వాత కూడా ఆ చానల్ ఆగకుండా తిట్ల దండకం అందుకొని అర్ధగంటకు పైగా దూషణల పర్వాన్ని నడిపారు. అదే విధంగా రోడ్డుపై ఓ జోక్ షోను ఆ చానల్ వారు చిత్రీకరించి విశ్వక్ ను మరింత దిగజార్చేలా చేశారు.

అయితే వేనోళ్ల విశ్వక్ సేన్ కు మద్దతు పెరుగుతూనే వస్తోంది. కానీ అనుకున్న రీతిలో ఒక తెలంగాణ హీరోకు జరిగిన అవమానంపై సరిగా ఈ ప్రాంత ప్రజలు స్పందించలేదనేది వాస్తవం. ఆంధ్రప్రదేశ్, ఇతర ప్రాంతాల్లో ఉన్న తెలుగు ప్రజలు మాత్రం విశ్వక్ సేన్ కు సపోర్టుగా నిలుస్తున్నారు.

మరి అలాంటప్పుడు తెలంగాణవాసులు ఆయనకు సపోర్టుగా నిలవాల్సిన అవసరమెంతైనా ఉంది. ఈ దశలో ఈప్రాంతీయులు పోరాటాలు చేయకున్నా.. కనీసం ఆయన సినిమాకు మద్దతుగా నిలిస్తే సరిపోతుందనేది పలువురు తెలంగాణ మేథావులు, కవులు, కళాకారులు కోరుతున్నారు.

మే 6న విడుదలవుతున్న ‘‘అశోక వనంలో అర్జున కల్యాణం’’ సినిమాను ప్రతీ ఒక్కరు తప్పకుండా చూసి విశ్వక్ సేన్ తప్పులేదని నిరూపిద్దాం. ఆయన మరో ఎత్తుకు ఎదిగేలా చేద్దాం. ఆ సినిమాను విజయం దిశగా పయనింపజేసి విశ్వక్ సేన్ ను అమానించిన ఆ చానల్ కు చెంప చెల్లుమనిపిద్దాం. అందుకే ‘‘ఫర్ ద విశ్వక్ సేన్’’ పాటిద్దాం.