కోడలిదానం చేసిన అత్తామామలు

ఇదేం చిత్రం.. గోదానం, భూదానం, సువర్ణదానం ఆఖరుకు కన్యాదానం అంటారు కదా.. కోడలిదానం అంటాడేంటి అనుకుంటున్నారా.. నిజమేనండి పూర్తిగా చదవండి మీకే తెలుస్తుంది..

మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి యుగ్ ప్రకాశ్ కుమారుడు ప్రియాంక్ తివారి కరోనా మహమ్మారితో కన్నుమూశాడు. ఆయనకు భార్య ప్రియాంకతో పాటు 9ఏళ్ల కూతురు ఉన్నారు.

ఈ సమయంలో తమ కోడలి జీవితం చీకటిమయం కావద్దని యుగ్ ప్రకాశ్ దంపతులు నిర్ణయించుకున్నారు. ఎవరూ తీసుకోని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. కోడలికి ఓ తోడును చూసి రెండో పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. దానికోసం వెదకసాగారు. ఇంతలో వారనుకున్నట్లు వరుడు దొరికాడు.

ఇంకేముంది కోడలిని ఒప్పించారు. ఆమెను తమ సొంత కూతురిలా భావించారు. ఆమె జీవితంలో వెలుగులు నింపేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఆ పుణ్యదంపతులు మరింత మానవత్వం చాటుకున్నారు. అదేంటంటే ఆ కోడలికి సొంత తల్లిదండ్రులుగా మారి పెళ్లిలో వరుడి కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. ఇప్పుడర్థమైందా.. వరుడికి కోడలి(కన్యా)దానం చేసి పుణ్య దంపతులయ్యారు.

వారి దయార్థ్ర హృదయం మరింత విశాలమైందని వారు మళ్లీ నిరూపించుకున్నారు. వారి కొడుకుకు చెందిన సుమారు రూ.60 లక్షల విలువైన ఇంటిని తమ కోడలికి రాసిచ్చారు. ఇప్పుడు ఆ దంపతులు అదే ఇంటిలో ఉంటున్నారు.

ఇప్పుడేమంటారో చెప్పండి.. కోడలికి మరో పెళ్లి చేసిన వారిని పుణ్య దంపతులు అనాలా.. మానవతా మూర్తులు అనాలా.. దేవతా మూర్తులే అనాలా.. మీరే నిర్ణయించుకోండి.

తాజాగా జరిగిన ఈ వైనంపై అక్కడి స్థానికులు మాత్రం వారిని వేనోళ్ల కొనియాడుతున్నారు. వారి మానవీయతపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.