ఢిల్లీ మృతుల సంఖ్య 50?

• అగ్నిప్రమాద ఘటనపై తాజా అప్ డేట్స్
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య శనివారం 50కి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున శిథిలాల తొలగింపు కార్యక్రమం కొనసాగుతోంది. శిథిలాల కింద ఒక్కొక్కటిగా మృతదేహాలు బయట పడుతున్నాయి.

నగరంలోని ముంబ్కా మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలోని 4 అంతస్థుల కమర్షియల్ భవనంలో శుక్రవారం మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే మృతుల సంఖ్య 27గా గుర్తించారు. మరో 29 మంది ఆచూకీ కోసం ఫిర్యాదులు అందాయి. ఈ ప్రమాదం నుంచి 50 మందిని కాపాడారు.

ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ఘటనా స్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై మెజిస్టీరియల్ విచారణ జరుపుతామని ప్రకటించారు.

అదే విధంగా పీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

ఆచూకీ తెలియాల్సిన 29 మందిలో 24 మంది మహిళలు ఉన్నట్లు ఫిర్యాదులు అందాయి. బాధిత కుటుంబాల సభ్యులు తమ వారి కోసం ఎదురు చూస్తున్నారు. అయితే డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతులను గుర్తించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనిని ఘోర కలిగా అభివర్ణించారు.