తప్పతాగి ఆలస్యంగా వచ్చిన వరుడు.. షాకిచ్చిన వధువు

అప్పుడప్పుడూ కొన్ని పెళ్లి పందిళ్లలో విచిత్రాలు చోటు చేసుకుంటాయి. సరిగ్గా అలాంటిదే ఇక్కడా జరిగింది. వరుడు చేసిన నిర్వాకానికి వధువు తీసుకున్న నిర్ణయం షాక్ కు గురి చేసింది. దాంతో వరుడుతో సహా అక్కడున్న బంధుగణం మూసుకొని అక్కడి నుంచి జారుకున్నారు.

రాజస్థాన్ రాష్ట్రంలోని చురు జిల్లా చలాగా గ్రామంలో ఓ జంటకు ఈనెల 15న రాత్రి 1.15 గంటలకు పెళ్లి జరపాలని పెద్దలు నిశ్చయించారు. ఆ మేరకు ఏర్పాట్లు జరిగాయి. ముందురోజు సాయంత్రమే వరుడు సహా బంధుమిత్ర గణం వధువు గ్రామానికి చేరుకుంది.

పెళ్లికి ముందు అదే రాత్రి 9గంటలకు బరాత్ మొదలైంది. ఈ సమయంలో తన స్నేహితులతో కలిసి వరుడు మద్యం తాగాడు. వారితో కలిసి నృత్యాలు చేస్తూ మైమరిచిపోయాడు. మద్యం తాగి, నృత్యాల్లో తేలియాడుతూ పెళ్లి వేదిక వద్దకు ఆలస్యంగా చేరుకున్నాడు.

అప్పటికే వేచి ఉన్న వధువు ఈ తంతంగమతా చూసి రగిలిపోయింది. ఇప్పుడే ఇలా చేశాడు.. మున్ముందు ఎలా చేస్తాడోనని సంశయం పెట్టుకుంది. ఇక అతడొద్దని చీదరించుకుంది. వెంటనే అక్కడే తన బంధువుల్లో ఉన్న ఓ యువకిడిని ఒప్పించి అదే వేదికపై పెళ్లి చేసుకొంది. అవాక్కవడం అక్కడున్న వారి వంతయింది.

ఇదిలా ఉండగా వరుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికి ముందే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే జరిగాక మరెంతగా ఉంటాడోనని పెళ్లిని రద్దు చేసుకున్నట్లు వధువు కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు.