రచ్చబండ : పట్టుదలతో చదివి పరీక్షలు బాగా రాసిన ఆనందం ఎంతో కాలం నిలవలేదు. తాను మరింత ఎత్తుకు ఎదగాలన్న కలలు కల్లలయ్యాయి. అందరిలో మేటి అవుతాననుకున్న ఆశలు గల్లంతయ్యాయి. అందరిలో తానే టాపర్ గా నిలిచానన్న ఫలితాన్ని చూసుకునేందుకు ప్రాణమే లేకుండా పోయింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల గ్రామానికి చెందిన రాజేశ్వరి ఇదే జిల్లాలోని కేజీబీవీ కళాశాలలో ఇంటర్ లో ఎంపీసీ పూర్తి చేసింది. కళాశాలలో అందరి కంటే మేటిగా చదువుతూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ వచ్చింది. కష్టపడి చదివి ఫైనల్ పరీక్షలు రాసింది.
పరీక్షలు పూర్తవగానే ఆనందంగా తండ్రితో కలిసి ఇంటికి బైక్ పై ఇంటికి బయలుదేరింది. మే నెల 19న జరిగిన రోడ్డు ప్రమాదంలో తన తండ్రితో పాటు రాజేశ్వరి కూడా తనువు చాలించింది. అయితే గత మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 867 మార్కులు సాధించింది.
గద్వాల జిల్లాలోని అన్ని కేజీబీవీ కళాశాలల్లో రాజేశ్వరే జిల్లా టాపర్ గా నిలిచిందని ఆలస్యంగా తెలిసింది.
ఇంత ప్రతిభ కలిగిన విద్యార్థిని ఫలితాన్ని చూసుకోలేక పోయిందని అధ్యాపకులు, తోటి విద్యార్థులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉత్తమ ఫలితం సాధించిన విద్యార్థిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించడంపై ఇటిక్యాల గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు.