మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమా నటుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాలను ప్రస్తుతం దాదాపు వదిలేశారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినీ రంగంలోనూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుల్లో చిరంజీవి అగ్రగణ్యుడు.
ఈ దశలో ఈనెల 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే ఓ కార్యక్రమానికి మోదీతో సహా పాల్గొనాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. భీమవరంలో మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి నుంచి ఆహ్వానం అందింది.
ప్రధాని మోదీతో చిరంజీవి పాలుపంచుకునే మొదటి వేదిక ఇదే కావడం గమనార్హం. దీంతో చిరంజీవి తప్పక హాజరయ్యే అవకాశం ఉంది.
ఈ దశలో రాష్ట్రంలో ప్రజాభిమానం అధిక సంఖ్యలో ఉన్న చిరంజీవిని వాడుకోవాలనిలని బీజేపీ యోచిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఛరిస్మాను ఉపయోగించుకొని ఎలాగైనా బీజేపీ, లేదా అనుకూల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నది ఆ పార్టీ పెద్దల ప్లాన్ గా అంచనా వేస్తున్నారు.
పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్, సౌమ్యుడుగా పేరున్న చిరంజీవిని వాడుకుంటే తమ పార్టీకి పెద్ద దిక్కు దొరికినట్టేనని బీజేపీ భావిస్తోంది.
మరో ముఖ్య విషయమేమిటంటే తమ పార్టీలో చేరితే కేంద్రంలో చిరంజీవికి మంత్రి పదవి ఇచ్చేందుకు కూడా బీజేపీ సుముఖంగా ఉన్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఆ తర్వాత రాష్ట్రంలో చిరంజీవి నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ ప్లాన్ వేస్తున్నట్లు విశ్లేషిస్తున్నారు.