అతనో వైద్యుడు.. ఆషామాషీ డాక్టరూ కాదు.. ఎండీ పట్టా పొందాడు.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎంచక్కా విధులు నిర్వహిస్తున్నాడు. ఎలా బుద్ధి పుట్టిందో.. ఏమో కానీ పనిచేసే చోటే చోరీకి పాల్పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. జైలుకు నెట్టబడ్డాడు. ఎలా జరిగిందో.. ఎక్కడో తెలుసుకోండి..
రచ్చబండ, హుజూర్ నగర్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ పట్టణంలోని లింగగిరి రోడ్డులో గల అభయ హాస్పిటల్ ఉంది. అదే ఆస్పత్రిలో నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన చిర్రబోయిన రాంకోటి (27) డాక్టర్ (ఎండీ)గా ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నాడు.
ప్రాణాలు నిలబెట్టాల్సిన ఆ డాక్టర్ కు ఎందుకు దుర్భుద్ధి కలిగిందో తెలియదు గానీ, జూన్ 30న రాత్రి సమయంలో హాస్పిటల్ భవనం పైఅంతస్తులో గల ఇంటిలోనికి చొరబడ్డాడు. తన వద్ద గల ఓ తాళం చెవితో బీరువా తాళం తీసి అందులోని రూ.2.74 లక్షల నగదు, ఒక బంగారు నల్లపూసల గొలుసు, 4 బంగారు ఉంగరాలను చోరీ చేశాడు. అదే భవనంలో ఉన్న తన గదిలో ఆ నగదు, ఆభరణాలను దాచి ఉంచిన అనంతరం పారిపోయాడు.
చోరీ చేసిన నగదు, బంగారం కోసం గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో మళ్లీ అతను హాస్పిటల్ కు వచ్చాడు. విషయం తెలుసుకున్న హుజూర్ నగర్ ఎస్ఐ వెంకట్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వెళ్లి చాకచక్యంగా రాంకోటిని పట్టుకున్నారు.
నిందితుడి నుంచి నగదు, బంగారం స్వాధీన పరచుకుని కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండుకు తరలించారు. చూశారా.. డాక్టర్ గా ఐదెంకల జీతం తీసుకుంటూ హాయిగా ఉండాల్సిన వాడు కటకటాలు లెక్కించాల్సిన దుస్థితిని కొని తెచ్చుకున్నాడు.