Shankerpally police station.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన 11 ఏండ్ల బాలుడు.. ఎందుకో తెలుసా?

రచ్చబండ, శంకర్ పల్లి: ఆ బాలుడి వయసు పదకొండేళ్లు. ఎంత బాధ అనుభవించాడో ఏమో.. కానీ పోలీస్ స్టేషన్ కు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఎలాంటి జంకు లేకుండా, పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తన బాధను ఎస్సైకి చెప్పి పరిష్కారం చేయమని కోరాడు. అసలు బాలుడికి వచ్చిన బాధ ఏంటో చూద్దాం రండి.

రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు మంగళవారం శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని హనుమాన్ నగర్ కాలనీలో నివసిస్తున్న 11 సంవత్సరాల వయసున్న బాలుడు వచ్చాడు. తల్లిదండ్రులు తరచూ తనను కొడుతున్నారని ఆ బాలుడు ఎస్ఐ సంతోష్ రెడ్డికి చెప్పాడు. తనకు జరిగిన విషయాలపై ఏకరువు పెట్టాడు. ప్రశాంతంగా విన్న ఎస్సై సంతోష్ రెడ్డి ఆ బాలుడి తల్లిదండ్రులు నరసింహులు, లక్ష్మిని స్టేషన్ కు పిలిపించాడు.

వారిద్దరికీ ఎస్ఐ కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలను ప్రేమతో పెంచుకోవాలని హితవు పలికారు. కొట్టడం వల్ల ఫలితం ఉండదని, ఏదైనా శాంతియుతంగా చెప్పాలని వివరించారు. కాగా బాలుడి తండ్రి రాములు మేస్త్రి పని చేస్తుంటారని తెలిపారు. ఇక నుంచి కొట్టకుండా పెంచుకుంటామని వారు తెలిపి తమ బాలుడిని తీసుకెళ్లారు.