అది ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపం

* టీయూటీఎఫ్రా ష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ రెడ్డి
* ఘనంగా టీయూటీఎఫ్ 13వ ఆవిర్భావ దినోత్సవం

రచ్చబండ, శంకర్ పల్లి : తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించి,తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమమే ఊపిరిగా అలుపెరగని పోరాటం చేసిన తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీయూటీఎఫ్) సంఘం ఒక చారిత్రక అవసరంగా 7 ఆగస్టు 2011న ఆవిర్భవించి 12 సంవత్సరాలు పూర్తయ్యి 13వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా తెలంగాణా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో టీయూటీఎఫ్ జెండాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి రఘునందన్ రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.రఘునందన్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన, లోపభూయిష్టమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం(సీపీఎస్)ను వెంటనే రద్దు చేయాలని, బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని, గత ఏడు సంవత్సరాలుగా పదోన్నతులు, నాలుగు సంవత్సరాలుగా బదిలీలు లేక అదే క్యాడర్లో రిటైర్ అయ్యే పరిస్థితిలో ఉపాధ్యాయులు మానసిక ఆందోళనకు గురైతున్నారని వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని కోరారు.

ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని, సర్వీసు రూల్స్ వివాదంతో పదోన్నతులు లేక నిలిచిపోయిన మండల విద్యాధికారి, జిల్లా ఉప విద్యాధికారి, డైట్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ వంటి పోస్టుల్లోకి తొలుత పదోన్నతులు ఇవ్వాలని, సీనియారిటీ కలిగిన స్కూల్ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్మాస్టర్లుగా, డైట్ లెక్చరర్లుగా, జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇవ్వాలని, గెజిటెడ్ హెడ్ మాస్టర్లకు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్లుగా పదోన్నతులు ఇవ్వాలని, జిల్లా విద్యా శిక్షణ సంస్థల్లో పనిచేసే లెక్చరర్లకు సీనియర్ లెక్చరర్లుగా పదోన్నతులు ఇవ్వాలని కోరారు.

పదోన్నతులతో ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నిబంధనల మేరకు అర్హతలు ఉన్న ఎస్జీటీలతో నింపాలని, ఆర్దిక శాఖ ఆమోదం పొందిన పీఎస్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను పదోన్నతులతో నింపాలని, అప్గ్రేడ్ చేసిన పండిత, పీఈటీ పోస్టులను పదోన్నతులతో నింపాలని, 317 జీవో బాధిత ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కొరకు తక్షణమే సర్వీస్ పర్సన్స్ నియామకానికి చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో ప్రత్యక్ష నియామకాలు జరిగేలోగా విద్యాబోధనకు ఆటంకం కలుగకుండా అవసరమైన చోట విద్యా వాలంటీర్లను నియమించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మునీర్ పాషా, జిల్లా ఉపాధ్యక్షులు K. నారాయణ, శంకర్ పల్లి మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏ. సుదర్శన్, వీ శ్రీనివాస్ చారి, చేవెళ్ల మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దయానందం,శివానందం, నాయకులు బి. దేవేందర్ రెడ్డి, మొగులయ్య, శంకరయ్య, వెంకటేశ్వర రావు, మోహన్ రెడ్డి, వరప్రసాద్, జగదీశ్వర్, తదితరులు పాల్గొన్నారు.