హైదరాబాద్ లో మరో ఘోర అకృత్యం

రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ లో ఎన్నో ఘోరాలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవల వరుస ఘటనలతో నగర ప్రతిష్ఠ మసకబారే పరిస్థితి దాపురించింది. తాజాగా నగరంలోని ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఘోర అకృత్యం సమాజానికి పిడుగులాంటి ఘటనగా హెచ్చరికలు చేస్తోంది. ఓ మైనర్ బాలికపై ఎలాంటి ఘోర అకృత్యాలు జరిగాయో చదవండి.

ఛత్రినాక పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇదే ప్రాంతానికి చెందిన ఓ మైనర్ బాలిక (17)కు ఆరు నెలల క్రితం పుట్టిన రోజు సందర్భంగా వరుసకు సోదరుడైన యువకుడు (32) సెల్ ఫోన్ ను గిఫ్ట్ గా ఇచ్చాడు.

కొన్ని రోజులకు ఆ ఫోనుకు చెందిన బ్యాంకు ప్రాసెస్ ఉందని, దాని నుంచే ఈఎంఐ చెల్లించాలని, నువు వస్తే బ్యాంకు పని కాగానే సెల్ ఇచ్చేస్తా.. అని నమ్మబలికి మాయమాటలతో మలక్ పేటకు తీసుకెళ్లాడు.

అక్కడికెళ్లాక ఓ లాడ్జిలోకి తీసుకెళ్లి వావి వరుసలు మరిచి ఆ బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ బెదిరించాడు.

దీంతో భయపడిన ఆ బాలిక ఎవరికీ చెప్పలేదు. దానిని అలుసుగా తీసుకున్న ఆ కామాంధుడు బాలికను బెదిరిస్తూ గత ఆరు నెలలుగా అత్యాచారానికి ఒడిగట్టాడు.

ఇదిగాక మరో పీడ ఆ బాలికను వెంటాడి, వేధించి సాధించింది. మొదటి దుండగుడి స్నేహితుడు (24) సదరు బాలికను బ్లాక్ మెయిల్ చేశాడు. ‘మీ ఇద్దరి నడుమ జరిగింతంతా నాకు తెలుసు.. నా ఫ్రెండ్ అంతా చెప్పాడు. నేను చెప్పింది వినకపోతే అందరికీ చెప్తా.. అంటూ బెదిరింపులకు దిగాడు.

దీంతో భయపడిన ఆ బాలికను ఆ దుర్మార్గుడు తన ఇంటికి రప్పించుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఆ ఇద్దరు కామాంధులు ఆ బాలికపై వరుసగా లైంగికంగా దాడి చేయసాగారు.

ఈ విషయం ఎవరికీ చెప్పుకోలేక కుమిలిపోతున్న ఆ బాలిక పొట్ట పెద్దగా కనిపించడాన్ని కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో బుధవారం ఆ బాలికను గట్టిగా నిలదీయడంతో తనకు జరిగిన ఘోరాన్ని వారికి చెప్పి బోరున విలపించింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించగా ఐదు నెలల గర్భవతి అని తేలింది. దీంతో బాలికతో కలిసి వెళ్లి ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నిందితులపై వివిధ సెక్షన్లపై కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనలపై విచారణ జరుపుతున్నారు.

ఇంతటి అకృత్యాలను వింటేనే ఒళ్లు గగుర్పొడుస్తున్నట్లుంది. అందుకే హెచ్చరిక అన్నది. ఆడపిల్లలున్న కుటుంబ సభ్యులు తమ పిల్లలకు ఎలాంటి హాని జరగకుండా నిత్యం జాగరూకతతో ఉండాలి. కామాంధుల కళ్లు పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచన.