Telongana Minister.. వామ్మో ఈ మంత్రి సంబురం చూడుర్రి

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : అధికారం ఉంటే దర్జా.. దర్పం ప్రదర్శించడం పరిపాటి. కానీ ఈ మంత్రి అవేమీ పట్టించుకోరని తెలిసిపోయింది. కిందిస్థాయి నుంచి వచ్చిన ఆయన తన శాఖలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని కితాబు. సీఎం కేసీఆర్ సహకారంతో పాటు ఐటీ మంత్రి కేటీఆర్ తో ఉన్న చనువుతో తన శాఖలను ముందుకు తీసుకెళ్తున్న ఆ మంత్రి క్రీడా స్ఫూర్తిని చాటి శభాష్ అనిపించుకున్నారు.

ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా కొనసాగుతున్న వి.శ్రీనివాస్ గౌడ్ క్రీడల పట్ల తనకున్న అభిరుచి ఆస్వాదిస్తూ వ్యక్తం చేసిన ఆనందంపై అందరూ ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఢిల్లీలో ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం తెలంగాణ రాష్ట్రానికి చెందిన సంచలన బాక్సర్ నిఖత్ జరీనా పాల్గొన్నారు. నిఖత్ పాల్గొన్న ఫైనల్ పోటీలను తిలకించేందుకు రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ఢిల్లీ వెళ్లి పోటీలను వీక్షించారు.

ఉత్కంఠగా సాగిన ఈ పోటీల్లో నిఖత్ జరీనాను విజేతగా ప్రకటించిన క్షణాల్లో మంత్రి ఆనంద పరవశుడయి తాండవమే చేశారు. తన రాష్ట్రానికి ఖ్యాతి దక్కిందనే భావంతో ఉబ్బి తబ్బిబ్బయ్యారు. అక్కడి తోటి వారితో తన సంతోషాన్ని పంచుకొని క్రీడా స్ఫూర్తిని చాటారు. అనంతరం క్రీడాకారిణి నికత్ ను ప్రత్యేకంగా అభినందించి రాష్ట్రానికి దక్కిన ఖ్యాతిగా అభివర్ణించారు.

ఆమె స్ఫూర్తిగా రాష్ట్ర క్రీడాకారులు మరింత ఎత్తుకు ఎదగాలని, రాష్ట్రానికి పేరు, ప్రఖ్యాతులు తేవాలని కోరుకున్నారు. దీన్ని చూసిన వారు మంత్రికి అభినందనలు తెలిపారు. మంత్రి అంటే ఇలా ఉండాలి. తన శాఖ పట్ల ఇంతటి అభిమానం చూపుతున్నారంటే ఆయన చిత్తశుద్ధిని కీర్తించసాగారు.