• ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు
మధిర : అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మధిర పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు.
ముందుగా మడుపల్లి నుంచి బయ్యారం మీదుగా మోటమర్రి వరుకు రూ.208 లక్షలతో నిర్మిస్తున్న బీటీ రోడ్డు పునరుద్ధరణ పనులను ఆయన పరిశీలించారు.
అదే విధంగా మధిర శివాలయం వద్ద వైరా నది పక్కన భక్తుల సౌకర్యం కోసం నిర్మిస్తున్న స్నానాల ఘాట్ ను పరిశీలించారు. అనంతరం అక్కడ నుంచి మధిరలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకొని అక్కడ రూ.36 కోట్లతో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు చైర్మన్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ పాలనలోనే మధిర నియోజకవర్గం అభివృద్ధి సాధించిందని వివరించారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, అంతర్గత రోడ్ల నిర్మాణం, లింక్ రోడ్ల పునరుద్ధరణతో పాటు అనేక అభివృద్ధి పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారి నాగేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావూరి శ్రీనివాసరావు, యూత్ విభాగం నియోజకవర్గ కన్వీనర్ కునా నరేందర్ రెడ్డి, చావా వేణు, మేడికొండ కిరణ్, జేవీ రెడ్డి, ఎర్రగుంట రమేష్, వైవీ అప్పారావు, కృష్ణా నాయక్ తదితరులు పాల్గొన్నారు.