ప్రసిద్ధ పుణ్యక్షేత్రానికి నడవని బస్సు!

మఠంపల్లి : సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు ప్రగతిరథ చక్రాలు ఆగిపోయాయి. వివిధ గ్రామాలకు బస్సు సౌకర్యం లేక రెండేళ్లు దాటింది. కరోనాతో పడ్డ బ్రేక్ నేటికీ అలానే కొనసాగుతూనే ఉంది.

ఇదే మండలంలో ప్రసిద్ధ లక్ష్మీ నరసింహ స్వామి నెలవైన పుణ్యక్షేత్రమున్న మట్టపల్లి గ్రామంతో పాటు గుండ్లపల్లి, రఘునాథపాలెం, రామచంద్రాపురం తండా, మంచ్యా తండా, వరదాపురం గ్రామాలకు నిత్య బస్సు సర్వీసులు ఉండేవి. నేడు ఆయా గ్రామాలకు పల్లె వెలుగు బస్సు కనిపించని వైఖరిపై ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

ఆదాయం లేకపోవడమే కారణమా ?
ఆదాయం లేని రూట్లలో బస్సులు నడపొద్దని సంస్థ అనధికార ఆదేశాలు ఇచ్చి ఉండటం కారణమేమోనని అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ప్రతి పల్లకు బస్సు నడపాలన్న లక్ష్యం నీరుగారినట్లేనని ప్రజలు అంటున్నారు.

పౌర జీవనంలో బస్సు ప్రగతికి చిహ్నం
పౌరులకు కనీస వసతులలో బస్సు సౌకర్యం కల్పించడం ప్రభుత్వాల బాధ్యతని మేధావులు అన్నారు. ఆదాయంతో సంభంధం లేకుండా బస్సును అందుబాటులో ఉంచాలని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి మఠంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు బస్సు సర్వీసులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.