• సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సూచనలు
సిరిసిల్ల టౌన్ : యువత కష్టపడి చదివితే కోరుకున్న సర్కారు కొలువులు సొంతం అవుతాయని సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే యువతకు పిలుపునిచ్చారు. పోలీస్, ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో నిర్వహించనున్న పోటీ పరీక్షల్లో షెడ్యుల్డ్ కులాలకు చెందిన యువత కోసం జిల్లా పోలీసు శాఖ అధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలోని ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
అంబేద్కర్ భవనంలో నిర్వహిస్తున్న ఉచిత పోటీ పరీక్షల శిక్షణ తరగతులను ఎస్పీ పరిశీలించి, అభ్యర్థులకు నోటు పుస్తకాలను అందజేసి, శిక్షణ పొందుతున్న యువతకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న యువత ప్రణాళికాబద్ధంగా చదవాలని సూచించారు. తాము దరఖాస్తు చేసుకున్న ఉద్యోగానికి తగ్గట్లుగా సబ్జెక్టులు, సిలబస్ పై దృష్టి సారించాలని అన్నారు.
యువతకు ఈ సమయం చాలా విలువైనది కావున అనవసరమైన వాటికోసం సమయాన్ని వృథా చేసుకోవద్దని హితవు పలికారు. ప్రతి నిమిషాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ముఖ్యంగా యువత ఉద్యోగాన్ని సాధిస్తామనే ఆత్మసైర్యాన్ని పెంపొందించుకోవాలని కోరారు.
తమకు కష్టసాధ్యమైన సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాలని సూచించారు. అదే విధంగా యువత ప్రభుత్వ కొలువులు సాధించాలంటే ముందుగా సెల్‌ఫోన్‌తో పాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా ముఖ్యమని ఎస్పీ యువతకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ సర్వర్, జిల్లా షెడ్యుల్ కులాల అభివృద్ధి శాఖ అధికారి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.