తెలంగాణ రాష్ట్రంలో పరువు హత్యల పాపాలు పెరిగిపోతున్నాయి. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న సరూర్ నగర్, బేగం బజార్ పరువు హత్యలను మరువక ముందే ఆదిలాబాద్ జిల్లాలో మరో పరువు హత్య సంచలనం రేపింది.
ఆయా సంఘటనల్లో బామ్మర్దులు సొంత చెల్లెళ్ల భర్తలను హతమార్చగా ఇక్కడ మాత్రం కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్న తండ్రే హతమార్చాడు. వేరే మతానికి చెందిన యువకుడిని పెళ్లి చేసుకున్న పాపానికి ఆ యవతి తండ్రి చేతిలో హత్యకు గురైంది.
ఆదిలాబాద్ జిల్లా నార్నూరు మండలం నాగల్ కొండలో యువతి రాజేశ్వరి దారుణ హత్యకు గురైంది. ఆ యువతి తల్లిదండ్రులు ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదు. వేరే మతస్థుడని నిరాకరించారు. దీంతో ప్రేమికులు ఇద్దరూ మూడు నెలల క్రితం పారిపోయి పెళ్లి చేసుకున్నారు.
ఇటీవలే వారిద్దరూ తిరిగి గ్రామానికి వచ్చారు. గ్రామంలో పంచాయితీ పెట్టారు. యువకుడిని వదిలేయాలని ఆ యువతిని పెద్దలు హెచ్చరించారు. అయినా ఆ యువతి అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమెను తండ్రే దారుణంగా చంపాడు. వేరే మతం కావడంతోనే తాను తన కూతురిని చంపేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇలాంటి ఘటనలకు ఫుల్ స్టాప్ పడేదెలా అంటూ మానవతావాదులు ప్రశ్నిస్తున్నారు.