2023 మార్చి- మే మధ్యన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?

• వేణుస్వామి చెప్పిన సంచలన విషయాలు

ప్రముఖ జ్యోతిష పండితుడు వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితుడు. ఆయన చెప్పే భవిష్య విషయాలెన్నో సంచలనాలకు దారితీశాయి. ఆయన భవిష్యత్ గురించి చెప్పిన కొన్ని ముఖ్యమైన విషయాలు నిజమై కూర్చున్నాయి. దాంతో ఆయనకు మరింత పాపులారిటీ పెరిగింది.

నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టేలా భవిష్యత్ విషయాలు చెప్పే ఆయన శైలిని ఎందరో విమర్శించిన వారున్నారు.. సమర్థించే వారూ ఉన్నారు. కానీ ఆయన తనదైన శైలిని కొనసాగిస్తూనే ఉన్నారు.

వేణుస్వామి చెప్పిన కొన్ని భవిష్యత్ నిర్ణయాలు నిజం కావడం విశేషం. ముఖ్యంగా 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ పార్టీని విజయం వరిస్తుందని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికవుతారని వేణుస్వామి ముందుగానే చెప్పారు. ఎన్నికల అనంతరం సరిగ్గా అదే జరిగి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు.

వేణుస్వామి చెప్పిన మరో భవిష్యవాణి కూడా నిజమైంది. అదేంటంటే.. టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లయిన నాగచైతన్య, సమంత నిశ్చితార్థం అయిన తర్వాత వారి భవిష్యత్ గురించి వేణుస్వామి సంచలన విషయం వెల్లడించారు.

ఎప్పటికైనా వారిద్దరూ విడాకులు తీసుకుంటారని ఘంటాపథంగా చెప్పారు.. చెప్పుకుంటూ వచ్చారు. అదేంటో కానీ ఆయన చెప్పినట్లే నాలుగేళ్లకు అదే జరిగింది. నాగచైతన్య, సమంత విడాకులు తీసుకున్నారు.

ఇంకా పలు విషయాలపై గతంలో భవిష్యత్ వాణి వినిపించిన వేణుస్వామి తాజాగా తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే ఎన్నికల గురించి సంచలన విషయాలు చెప్పారు. ఉగాది పర్వదినాన్ని పురష్కరించుకొని పలు టీవీ చానళ్లకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూల్లో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు దేశ భవితవ్యం గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పడం గమనార్హం.

తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసీఆర్ జాతకచక్రం కలిపి చూస్తే 2023 మార్చి- మే నెలల్లో శాసన సభ ఎన్నికలు జరుగుతాయని జ్యోతిష పండితుడు వేణుస్వామి కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. వాస్తవంగా 2023 డిసెంబర్ లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ ముందుగానే జరుగుతాయని ఆయన చెప్పడం గమనార్హం.

మరో సంచలన విషయాన్నీ వేణుస్వామి వెల్లడించారు. అదేమిటంటే ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో తెలంగాణ శాసనసభ రద్దవుతుంది.. అని స్పష్టం చేశారు. అదెంతో కాలం లేదు.. దానికి 9, 10 నెలల కాలమే ఉంది.

ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ వాతావరణం నెలకొంది. సీఎం కేసీఆర్ ముందస్తుకు వెళ్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్ష పార్టీలు సైతం తమ విల్లంబులను ఎక్కుపెట్టి ఎన్నికలకు రెడీ అయ్యాయి.

ఇలాంటి తరుణంలో వేణుస్వామి చెప్పిన ఈ సంచలన విషయాలపై తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. మరి గతంలో ఆయన చెప్పిన విషయాలు నిజమైనట్లే ఇవీ నిజమవుతాయా.. మరి గ్రహగతులు మారి వక్రమార్గంలో పయనిస్తాయా అన్నది వేచి చూడాలి మరి..