పార్టీ పెట్టే పనిలో తీన్మార్ మల్లన్న బిజీ

యుద్ధం మిగిలే ఉంది ఉద్యమ నేలన.. సిద్ధం కమ్మంటోంది తెలంగాణలోన.. అంటూ సాగే పాటతో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతలో ఉత్తేజాన్ని రగిలించిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ప్రస్తుతం ప్రత్యామ్నాయ పార్టీ ఏర్పాటు పనిలో బిజీగా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఆయన పేరెత్తని అటు ప్రధాన మీడియా, ఇటు సోషల్ మీడియా ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం ఆయన పేరిట ప్రత్యేక కథనాలనే ప్రసారం చేస్తున్నాయి. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభధ్రుల నియోజకవర్గ స్థానంలో పోటీ చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీలను వెనక్కి నెట్టి, అధికార పక్షానికి ముచ్చెమటలు పట్టించిన తీన్మార్ మల్లన్నకు ధైర్యం, వాక్చాతుర్యమే ప్రధాన బలం. మూడు జిల్లాల్లో పాదయాత్ర చేసి పట్టభద్రులను ఆలోచింపజేయ్యడంలో కృతకృత్యుడయ్యాడు. ఒక దశలో గెలుపు అయనదేనంటూ చర్చకు దారితీసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పక్షం గెలిచి నిలిచింది. అయినా మల్లన్న రెండో స్థానంలో నిలిచి సంచలనానికి మారుపేరుగా నిలిచాడు.

మొదట ఓ టీవీ కార్యక్రమంలో తీన్మార్ వార్తల పేరిట మల్లన్నగా తెలంగాణ యాస, భాషలో హావభావాలను పలికి అందరి మన్ననలు పొందాడు తెలంగాణ ఉద్యమ కాలంలో ఆయన ఓ రకంగా తన కార్యక్రమం ద్వారా ఉద్యమ పాత్ర పోషించినట్టే లెక్క. అలాంటి మల్లన్న గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేశారు. విస్తృత స్థాయిలో ప్రచారం చేసినా ఓటమి తప్పలేదు. ఆ తర్వాత తీన్మార్ మల్లన్న ఓ యూట్యూబ్ చానల్ ద్వారా నిత్యం తనదైన శైలిలో అధికార పక్షంపై చెణుకులు విసురుతూ కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. కొందరి అవినీతిపై ధైర్యంగా ఎన్నో కథనాలను వెలుగులోకి తెచ్చారు. సీఎం కే‌సీ‌ఆర్ పై సైతం తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందారు తీన్మార్ మల్లన్న.

ఇధే సమయంలో వచ్చిన ఎం‌ఎల్‌సి ఎన్నికల్లో పోటీచేసి, ప్రణాళికాబద్ధంగా ప్రచారం చేసి పట్టభద్రుల ఆశాకిరణమయ్యాడు. చివరి వరకు తన గెలుపు కోసం పొరాడి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజే‌పీ, వామపక్షాల అభ్యర్ధుల తో పాటు టి‌జే‌ఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరాం ను వెనక్కి నెట్టి అధికార పక్షానికి గట్టి పోటీనిచ్చాడు. ఓ దశలో మల్లన్ననే గెలుపు వరిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనాకొచ్చారు. కానీ చివరి దశలో ఓటమి పొందినా హుంధాగా అంగీకరించి విజేత కు శుభాకాంక్షలు తెలిపారు. నైతికంగా తనదే విజయం అంటున్న తీన్మార్ మల్లన్న ఇంకా యుద్ధం మిగిలే ఉంధని అంటున్నాడు. ప్రగతి భవన్ గోడలు బద్దలు కొత్తడమే తన లక్ష్యం అని ఛాలెంజ్ విసురుతున్నాడు.

పనిలో పనిగా బలమైన వోటు బ్యాంకు పొందిన తీన్మార్ మల్లన్నను తమ తమ పార్టీల్లో చేర్చుకోవాలని ప్రధాన రాజకీయ పార్టీలు తహతహలాడుతుండటం విశేషం. అయితే తాను ఏ పార్టీలో చేరబోనని, ప్రజల అజెండాతో ముందుకెళ్తానని అంటున్నాడు మల్లన్న. అయితే ఇటీవల కొందరు భావ సారూప్యత కలిగిన రాజకీయ నేతలతో మల్లన్న విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయన కూడా కొన్ని సందర్భాల్లో ఇదే విషయాన్నీ ఒప్పుకున్నారు. దీన్ని బట్టి తెలంగాణాలో మరో బలమైన రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది.