రాష్ట్రానికి 12 జాతీయ అవార్డులు
ఫలితాలిచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టం
తెలంగాణ రాష్ట్రం అమలు చేసిన నూతన పంచాయతీ రాజ్ చట్టం సత్ఫలితాలిస్తూంది. నూతన చట్టం అమలు ద్వారా పల్లెల్లో సమూల మార్పులు జరుగుతున్నాయి. మునుపెన్నడూ లేని రీతిలో పంచాయతీల పరిధిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ముక్యంగా మౌలిక వసతుల కల్పన జరగడం శుభపరిణామం. చట్టం నిబంధనలతో పాటు కేంద్రం సూచనలను పకడ్బందీగా అమలు చేస్తూ రాష్ట్రం ముందుకు సాగుతుండడంతో సత్ఫలితాలకు దారి తీసింది. గ్రామాల్లో రోడ్లు, పారిశుధ్యం, తాగునీటి కల్పన తో పాటు ఇతర వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇచ్చిది. ఈ దశలో తాజాగా కేంద్రం ఉత్తమ పంచాయతీ రాజ్ సంస్థలకు ఇచ్చిన అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రానికే వివిధ కేటగిరీల్లో 12 అవార్డులు దక్కడం ముదావహం. దీన్దయాల్ ఉపాధ్యాయ సశక్తీకరన్ విభాగంలో ఉత్తమ జిల్లా పరిషత్ గా మెదక్, ఉత్తమ మండల పరిషత్ లుగా జగిత్యాల జిల్లా కోరుట్ల, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలాలు ఎంపికయ్యాయి. గ్రామా పంచాయతీ పురస్కారాల విభాగంలో కరీంనగర్ జిల్లా పార్లపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా హరిదాసు నగర్, మొహినీ కుంట, సిద్ధిపేట జిల్లా మిట్టపల్లి, మల్యాల, ఆదిలాబాద్ జిల్లా రుయ్యాడి, మహబూబ్ నగర్ జిల్లా చక్రపూర్, రెండు విభాగాల్లో పెద్దపల్లి జిల్లా సుందిళ్ల పంచాయతీలు అవార్డులకు ఎంపికయ్యాయి.
పల్లెల్లో సమూల మార్పులు
నూతన పంచాయతీరాజ్ చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులు వెచ్చిస్తూ, కేంద్రం నిధులను సద్వినియోగించుకుంటూ మౌలిక వసతులను కల్పిస్తూంది. ముఖ్యన్గా డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల నిర్మాణం, పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం. అదే విధంగా మిషన్ భగీరథ పథకం ద్వారా ఊరూరా స్వచ్ఛమైన తాగునీటిని అందించే చర్యలు అభినందనీయం. ప్రజల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి పేరిట ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడంలో ప్రభుత్వ పాత్ర మరువలేనిది.