వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తం

• కాంగ్రెస్ నేత ఇంటెదుట టీఆర్ఎస్ నాయకుడి ఆత్మహత్యాయత్నం
• జిల్లా కేంద్రంలో చికిత్స • బాధితుడి పరిస్థితి విషమం

పరిగి : కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఇంటి ఆవరణలో టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఆయన ఇంటి ఆవరణలో ఈ ఘటన చోటుచేసుకొంది. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఇటీవల పట్టణ పరిధిలో ఓ కౌన్సిలర్ కారు దహనం కేసులో తన పేరును ఇరికించారన్న మనస్థాపంతో పరిగి పట్టణ పరిధిలోని కిష్టమ్మ తండాకు చెందిన సేవ్యానాయక్ పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు.

మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డే తన పేరు చెప్పాడని బాధితుడు ఆరోపించడం సంచలనం కలిగిస్తోంది.
వెంటనే అక్కడున్న వారు సేవ్యానాయక్ ను వాహనంలో వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నాడు.

ఇదిలా ఉండగా సేవ్యానాయక్ కు ఎలాంటి అపాయం జరిగినా మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలని సేవ్యానాయక్ కుటుంబ సభ్యులు హెచ్చరించారు.

విషయం తెలిసిన పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డి తన పర్యటనలను రద్దు చేసుకొని హుటాహుటిన వికారాబాద్ లోని ఆస్పత్రికి వెళ్లి సేవ్యానాయక్ ను పరామర్శించారు. అతడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

మెరుగైన చికత్స అందించాలని డాక్టర్లను ఎమ్మెల్యే కోరారు. సేవ్యా నాయక్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

వికారాబాద్ మిషన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సేవ్యానాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ మేరకు అతడి నుంచి జిల్లా కోర్టు న్యాయమూర్తి మరణ వాగ్మూలం తీసుకున్నారు.