ఫ్రీలాన్స్ జర్నలిస్టు బంటు కృష్ణకు రాష్ట్ర అవార్డు

• రాష్ట్రస్థాయి ఉత్తమ జర్నలిస్టుగా మంత్రి హరీశ్ రావు చేతులమీదుగా ఘన సన్మానం
సూర్యాపేట : ఆర్ఎస్ఎన్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో సూర్యాపేటకు చెందిన సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ బంటు కృష్ణ రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన మానవీయ కథనాల వార్తల పోటీలో ఆయన ఎంపికయ్యారు. ఈ మేరకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పాల్గొన్నారు.

ఆయన చేతులమీదుగా బంటు కృష్ణ అవార్డు, ప్రశంసాపత్రంతో పాటు శాలువాతో ఘన సన్మానం పొందారు. బంటు కృష్ణకు రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డ్ రావడం పట్ల బంధుమిత్రులు, తోటి జర్నలిస్టులు, వివిధ పార్టీల నాయకులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయనకు అభినందనలు తెలిపారు.

అవార్డుల ప్రదానోత్సవంలో ఆర్ఎస్ఎస్ పౌండేషన్ చైర్మన్ రాపోలు సత్యనారాయణ, సీనియర్ సంపాదకులు రామచంద్రమూర్తి, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కే శ్రీనివాసరెడ్డి, ప్రముఖ కవి నందిని సిధారెడ్డి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు కారెం రవీందర్రెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవిశ్రీప్రసాద్, భాను ప్రకాష్, చంద్రశేఖర్ పాల్గొని ప్రసంగించారు.

రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన వందలాది మంది జర్నలిస్టులు, కవులు పాల్గొన్నారు.

జర్నలిజానికే అంకితం : బంటు కృష్ణ
సుదీర్ఘకాలంగా జర్నలిస్టుగా పనిచేస్తున్న తనకు రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్టు అవార్డు రావడం సంతోషంగా ఉందని అవార్డు గ్రహీత బంటు కృష్ణ తెలిపారు. ఈ పురస్కారం రావడం తనకెంతో ఆనందంగా ఉందని తెలిపారు. ప్రతిభ ఉన్న జర్నలిస్టులను గుర్తించడం సంతోషదాయకమైన విషయమని పేర్కొన్నారు. తనకు అవార్డ్ ఇచ్చి సత్కరించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తన జీవితం జర్నలిజానికే అంకితమని తెలిపారు.