దాడిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆదివారం రాత్రి జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. రెడ్డి సింహగర్జన సభలో పాల్గొన్న మంత్రి వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ దశలో తన ప్రసంగాన్ని ముగించుకొని మంత్రి అర్ధంతరంగా వెళ్తుండగా రాళ్లు, చెప్పులు, కుర్చీలు విసిరేసి ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

‘గుండాలతో దాడికి కుట్ర పన్నారు’
తనపై జరిగిన దాడిపై ఆ తర్వాత మంత్రి మల్లారెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డే దాడి చేయించారని ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే సభ పెట్టించి ప్రణాళిక ప్రకారం ఇలా చేశారని దుమ్మెత్తి పోశారు. ఆయన జైలుకు పోయేది ఖాయమని తేల్చి చెప్పారు.

ఇటీవలే రేవంత్ బండారాన్ని తాను బయటపెట్టానని, అందుకే ఆయన తనపై దాడికి కుట్ర పన్నారని ఆరోపణలు గుప్పించారు. తనను హత్య చేయడానికే గుండాలను అక్కడికి పంపాడని ఘాటుగా ఆరోపించారు. ఆయన కుట్రలు, కుతంత్రాలు, దాడులు, దౌర్జన్యాలతో కాలం వెళ్తదీస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

ఎవరినీ వదలబోము
తనపై జరిగిన దాడిలో పాల్గొన్న వారిలో ఎవరినీ వదలబోమని మంత్రి మల్లారెడ్డి హెచ్చరికలు చేశారు. అందరినీ గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారని చెప్పారు. కటకటాలు లెక్కించాల్సిందేనని స్పష్టం చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.

రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి రెడ్లకు కనిపించడం లేదా.. అని హితోబోధ చేశారు. కాళేశ్వరం వల్ల రెడ్లు బాగుపడలేదా.. పథకాలు రెడ్లకు వర్తించలేదా.. అని తన సామాజికవర్గం వారిని మంత్రి ప్రశ్నించారు. రెడ్లు అంతా కలిసే ఉండాలని హితవు పలికారు.

గతంలో ఎందరో రెడ్డి ముఖ్యమంత్రులు పనిచేశారని, ఏ ఒక్కరైనా రెడ్ల గురించి పట్టించుకున్నారా.. అని మల్లారెడ్డి ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి మేనిఫెస్టోలో పెట్టారు. దాన్ని అమలు చేసేందుకు నేను కృషి చేస్తూనే ఉన్నా అని చెప్పారు.