క్రైం కార్నర్

కర్ణాటకలో ముగ్గురు తెలంగాణవాసుల మృతి
హైదరాబాద్ : విహార యాత్రలో విషాదం చోటుచేసుకొంది. సంతోషంగా విహార యాత్రకు వెళ్లిన కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని మదికేరి వద్ద కోటే అబ్బి జలపాతంలో నీట మునిగి హైదరాబాదుకు చెందిన ముగ్గురు పర్యాటకులు మృతి చెందారు.

తెలంగాణకు చెందిన 16 మంది బంధుమిత్రులు విహార యాత్ర నిమిత్తం కర్ణాటక రాష్ట్రానికి వెళ్లారు. కుశాలనగర్‌లోని ప్రైవేటు హోమ్‌స్టేలో వారు బస చేశారు. ఆదివారం కోటే అబ్బి జలపాతం చూసేందుకు వెళ్లారు. సరదాగా నీటిలో దిగిన ముగ్గురు పర్యాటకులు ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.

ప్రమాద సమయంలో చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో గల్లంతైన వారిని రక్షించడం అసాధ్యంగా మారింది. మృతులు కలకోట శ్యామ(38), కలకోట శ్రీహర్ష(18), కలకోట షాహీంద్ర (16)గా గుర్తించారు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. గంటల తరబడి గాలింపు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది ఎట్టకేలకు ముగ్గురి మృతదేహాలను బయటకు తీశారు.

అప్పటి వరకు సంతోషంగా తమ మధ్య ఉన్న ఆత్మీయులు విగత జీవులుగా మారడంతో బంధు మిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సూర్యాపేటకు చెందిన వారు హైదరాబాద్ లో నివాసముంటున్నారు. ఈ విషయం తెలిసి సూర్యాపేట పట్టణానికి చెందిన కలకోట వెంకన్న బంధుమిత్రుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

గుంటూరు జిల్లాలో ఘోర దుర్ఘటన
గుంటూరు జిల్లా రెంటచింతల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 9మంది దుర్మరణం పాలయ్యారు. మరికొంత మందికి తీవ్రగాయాలయ్యాయి. పుణ్యక్షేత్రాలకు వెళ్లిన వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

శ్రీశైలం పుణ్యక్షేత్రం నుంచి తిరిగి వస్తున్న భక్తుల టాటా ఏస్ వాహనం రెంటచింతల వద్ద రోడ్డుపై ఆగిఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

క్షతగాత్రులను గురజాల ప్రభుత్వాస్పత్రికి అక్కడ మరో ముగ్గురు తమ ప్రాణాలిడిశారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.

వాహనంలో 38మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పరిమితికి మించి ఉండటంతో ప్రమాద సమయంలో ఒకరిపై ఒకరు పడి ఊపిరాడక చనిపోయారు. గాయాలైన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం.

తూ.గో. జిల్లాలో రోడ్డు ప్రమాదం


తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం యర్నగూడెం వద్ద హైవేపై సోమవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్ బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు.

విశాఖ పట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు వెనుక నుంచి ఐరన్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొన్నది. దీంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. బాధితులను సమీపంలోని కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.