రెడ్డిగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి

హైదరాబాద్ :తనదైన వ్యాఖ్యలతో తరచూ రచ్చకెక్కుతున్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై ఆదివారం రాత్రి దాడి జరిగింది. రాళ్లతో దాడి చేసి తరిమికొట్టారు. పోలీసుల సహాయంతో తప్పించుకొని వెళ్లిపోవాల్సిన పరిస్థితి దాపురించింది.

మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ పట్టణంలో ఆదివారం రెడ్డి సింహగర్జన సభ జరిగింది. ఈ సభలో మంత్రి మల్లారెడ్డి ప్రసంగిస్తూ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది.. అనగానే ఒక్కసారిగా సభలో కలకలం రేగింది.

ప్రభుత్వ పథకాలు వల్లె వేస్తుండగానే నిరసనలు వెల్లువెత్తాయి. ప్రతినిధులు ఆగ్రహంతో నినాదాలు చేస్తూ మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు.

ప్రతినిధుల నిరసనతో తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసిన మంత్రి మల్లారెడ్డి తన కాన్వాయ్ లో వెళ్తుండగా కుర్చీలు, రాళ్లు, చెప్పులతో దాడి చేశారు. పోలీసులు కాన్వాయ్ కు రక్షణ వలయంగా ఏర్పడి అక్కడి నుంచి మంత్రిని తరలించారు.