నల్లగొండ : నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్‌లో చేపలు పట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులకు జరిగిన వాదులాట ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లు రువ్వుకుని ఇరు రాష్ట్రాల మత్స్యకారులు దాడులు చేసుకున్నారు. సాగర్ బ్యాక్ వాటర్ పరిధిలో రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
సాగర్ బ్యాటర్‌లో ఇరు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులు చాలా కాలంగా చేపలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రింగ్ వలలతో వేటకు వెళ్లేందుకు కొందరు ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు యత్నించారు. వారిని తెలంగాణ మత్స్యకారులు అడ్డుకున్నారు.
రింగ్ వలలతో వేట సాగించవద్దని ఆంధ్ర మత్స్యకారులను తెలంగాణ వారు కోరారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నారు.
ఈ దాడుల్లో కొందరు మత్స్యకారులకు గాయాలు అయ్యాయి. అదే సమయంలో ఏపీకి చెందిన ఆరుగురు మత్స్యకారులను చందంపేటకు తీసుకెళ్లిపోయారని తెలిసింది. సమాచారం అందుకున్న ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లి ఏపీ మత్స్యకారులను విడిపించుకుని వెళ్లారని తెలిసింది. పోలీసుల ఎంట్రీతో ఇరువర్గాలు శాంతించాయి.